తెలంగాణా సీఎం కేసీఆర్ ఇప్పుడు చాలా ముఖ్యమైన పనిలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఏమిటా పని అంటారా? దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ముఖ్యంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకురావడం. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రధానిగా ఉండకూడదని, ఇంకా చెప్పాలంటే బీజేపీ అధికారంలోకి రాకూడదని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గతంలో ఈ ప్రయత్నం చేసినా ముందుకు పోలేకపోయారు. చాలా కాలం సైలంటుగా ఉండి మళ్ళీ విజృంభిస్తున్నారు. ఎప్పుడైతే హుజూరాబాదులో బీజేపీ గెలిచిందో అప్పటినుంచి ఆయనలో ఆలోచన మొదలైంది. ఒక ప్రణాళిక ప్రకారం మోడీ మీద, బీజేపీ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టగానే దానిపై దుమ్మెత్తిపోస్తూ ప్రెస్ మీట్ పెట్టారు.
ఇక అక్కడి నుంచి మొదలైన విమర్శల పరంపర తీవ్రంగా కొనసాగిస్తూ వచ్చారు. ఢిల్లీ కోటను బద్దలు కొడతామన్నారు. కేసీఆర్ మోడీపై విజృంభిస్తున్న తీరు మోడీని, బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల అధినేతలు కమ్ ముఖ్యమంత్రులకు నచ్చింది. వెంటనే వారు కేసీఆర్ ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఫోన్లు చేసి మద్దతు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే , మాజీ ప్రధాని దేవేగౌడ ఫోన్లు చేసి మోడీపై పోరాడండి. మీ వెంట మేముంటాం అని వెన్ను తట్టడమే కాకుండా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ కు వెయ్యేనుగుల బలం వచ్చేసింది. ఆయన మోడీని వ్యతిరేకించే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ తిరగాలని నిర్ణయించుకున్నారు.
తిరగడమంటే ఊరికే తిరిగిరావడం కాదు. వాళ్ళతో చర్చలు జరిపి బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడానికి ప్లాన్ తయారు చేయడం అన్న మాట. ఈ ఆలోచనలతో బిజీగా ఉన్న కేసీఆర్ నిన్న మేడారం పర్యాటనను కూడా రద్దు చేసుకున్నారని సమాచారం. ఎందుకంటే 20 వ తేదీన కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఠాక్రేతో చర్చలు జరపడానికి ముంబై వెళుతున్నారు. ఇక అక్కడి నుంచి ఆయన జైత్రయాత్ర మొదలవుతుంది. మార్చిలో కేసీఆర్ కోల్ కత్తా, బెంగళూరు వెళతారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ముఖ్యమంత్రులను, మాజీ ప్రధాని దేవెగౌడను యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమానికి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మార్చి 21 నుంచి 28 వరకు యాదాద్రిలో కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి మార్చి 10 తరువాత యూపీతో పాటు ఒడిశా, జార్ఖండ్ కూడా వెళతారట. ఇక్కడ చాలామందికి ఓ సందేహం రావొచ్చు. ఇన్ని రాష్ట్రాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న కేసీఆర్ పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళరా? అక్కడ ఉన్నది కూడా బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వమే కదా.
నిజమే … ఆ రెండు కూటములకు చెందని ప్రభుత్వమే. కానీ బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ సాగిస్తున్న పోరాటం పట్ల జగన్ ఆసక్తి చూపించడంలేదని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అందులోనూ జగన్ బీజేపీతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారట. కాబట్టి జగన్ మీద కేసీఆర్ ఆసక్తి చూపించడంలేదని చెబుతున్నారు. అందులోనూ కేసీఆర్ కు జగన్ కు మధ్య మంచి సంబంధాలు కూడా లేవు. 2020 వరకు వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉండేవి.
జగన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలుసుకున్నారు. ఆ సమయంలో కేసీఆర్ జగన్ కు ఘనస్వాగతం పలికి ఆత్మీయంగా కౌగిలించుకున్నారు కూడా. కేటీఆర్ కూడా తండ్రి మాదిరిగానే వ్యవహరించాడు. కానీ క్రమంగా ఇద్దరు సీఎంల మధ్య సంబంధాలు బీటలు వారాయి. నీటి పారుదల ప్రాజెక్టులు, నదీ జలాల పంపీణేయే ఇందుకు కారణం. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఉప్పు -నిప్పు మాదిరిగా ఉంది. రాష్ట్ర విభజనలో ఏపీకి కూడా అన్యాయం జరిగిందని కేసీఆర్, కేటీఆర్ అన్నారు తప్ప జగన్ ఏమీ మాట్లాడటం లేదు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడంలేదు. ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగా జగన్ దూకుడుగా లేరు. కేసీఆర్ ను జైలుకు పంపుతామని బీజేపీ నాయకులు అదేపనిగా చెబుతున్నప్పటికీ కేసీఆర్ లెక్క చేయడంలేదు. పైగా మోడీ ప్రభుత్వ అవినీతి చిట్టా తన దగ్గర ఉందని అంటున్నారు. కేసీఆర్ పోరాటంలో జగన్ కలిసే అవకాశం లేదు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అంటే కేసీఆర్ కు ఇష్టం లేదనే సంగతి అందరికీ తెలిసిందే.
బీజేపీని వ్యతిరేకించి చంద్రబాబు అధికారం పోగొట్టుకున్నారు. అయినప్పటికీ ఆయన బీజేపీ పట్ల సైలెంటుగానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదనే లక్ష్యం పెట్టుకున్న కేసీఆర్ చంద్రబాబును కూడా కలుపుకుపోయే ఆలోచన చేయవచ్చని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. తన లక్ష్య సాధన కోసం బాబు పట్ల ఉన్న కరడుగట్టిన వ్యతిరేకతను సడలించుకోవచ్చని చెబుతున్నారు. ఈ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.