వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తుపై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి నష్టం కలిగించేలా సీబీఐ చార్జిషీట్ ఉండడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఖుషీగా ఉంది. దీంతో సీఎం జగన్పై టీడీపీ ముఖ్యనేతలు వివేకా హత్య కేంద్రంగా విమర్శల దాడి పెంచారు. వైసీపీ కూడా తనదైన కోణంలో ఎదురు దాడికి దిగింది.
ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తునకు సంబంధించి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ తన పని తాను చేసుకుపోతోందని మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే సీబీఐ తనది కాని పని చేస్తోందనేది అధికార పార్టీ ఆవేదన, ఆరోపణ.
టీడీపీ హయాంలో వివేకా హత్య జరిగిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దీన్ని బట్టి హత్యతో ఎవరికి సంబంధం ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
తన హయాంలో జరిగిన హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకు భావించలేదని బాలినేని ప్రశ్నించారు. వివేకాను తన పార్టీ వాళ్లే హత్య చేయించి వుంటారనే భయంతో చంద్రబాబు సీబీఐ విచారణ జోలికి వెళ్లలేదన్నారు. కావున వివేకా హత్యపై చంద్రబాబు విమర్శలు అర్థరహితమన్నారు.