తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీకి సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డికి కట్టబెట్టడంపై ఆయన గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్‌రెడ్డిపై పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు.
జగ్గారెడ్డిపై సొంత పార్టీలోనే వ్యూహాత్మకంగా ఎదురు దాడి జరుగుతోంది. పార్టీలో కొందరు టీఆర్ఎస్ కోవర్టులున్నారని రేవంత్‌రెడ్డి పలుమార్లు పరోక్షంగా అన్నారు. రేవంత్‌రెడ్డి తనను దృష్టిలో ఉంచుకునే, పార్టీ నుంచి వెళ్లేగొట్టేందుకు పావులు కదుపుతున్నారనేది జగ్గారెడ్డి విమర్శ. రేవంత్‌రెడ్డి అందర్నీ కలుపుకుని వెళ్లడం లేదని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో పార్టీ నుంచి తాను వెళ్లడమే సరైందనే అభిప్రాయానికి ఆయన వచ్చారు.
టీఆర్ఎస్‌లో చేరుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ తాను ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగా ప్రజా సమస్యలపై పోరాడుతానని జగ్గారెడ్డి చెబుతున్నారు. ఇదిలా వుండగా జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం తెరపైకి రావడంతో సీనియర్ నేత వి.హనుమంతరావు ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీలోనే ఉండి, అంతర్గత సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ కాంగ్రెస్ పార్టీని వీడొద్దని కోరుతూ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని ప్రాథేయపడ్డారు.
జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై సోషల్ మీడియాలో ఉద్దేశ పూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా పని చేస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అందులో వాస్తవం లేదన్నారు. త్వరలో పార్టీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు.
నిజమైన కాంగ్రెస్ నేతలు పార్టీని వీడేలా కుట్ర జరుగుతోందని ఆయన పార్టీ పెద్దలకు తెలియజేయనున్నారు. జగ్గారెడ్డిని పార్టీలోనే కొనసాగేలా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డి మాత్రం పట్టించుకోనట్టు సమాచారం.