గుర్తు తెలియని వాట్సాప్ కాల్స్.. ఎత్తితే అంతే!

గడిచిన వారం, పది రోజులుగా అందరికీ ఎదురవుతున్న సమస్య ఇది. హఠాత్తుగా వాట్సాప్ కాల్ వస్తుంది. ఆ వెంటనే కట్ అవుతుంది. కొంతమందికి అదే పనిగా రింగ్ అవుతోంది. మరికొంతమందికి వీడియో కాల్స్ కూడా…

గడిచిన వారం, పది రోజులుగా అందరికీ ఎదురవుతున్న సమస్య ఇది. హఠాత్తుగా వాట్సాప్ కాల్ వస్తుంది. ఆ వెంటనే కట్ అవుతుంది. కొంతమందికి అదే పనిగా రింగ్ అవుతోంది. మరికొంతమందికి వీడియో కాల్స్ కూడా వస్తున్నాయి. ఈ అవాంఛిత కాల్స్ తో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు.

ఇంతకీ ఈ కాల్స్ ఏంటి..?

వాట్సాప్ వాడే చాలామందిని ఇప్పుడీ కాల్స్ ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని కాల్స్ కు కంట్రీ కోడ్ వస్తోంది, మరికొన్ని కాల్స్ అయితే ఎలాంటి కోడ్ నంబర్ లేకుండా వస్తున్నాయి. ఎక్కువ కాల్స్ +251, +60, +62, +254, +84 కోడ్స్ నుంచి వస్తున్నాయి. ఇవన్నీ ఇథియోపియా, మలేషియా, ఇండోనేషియా, కెన్యా, వియత్నాం దేశాలకు చెందిన కోడ్స్. 

ఇవే కాకుండా మరిన్ని ఆఫ్రికా దేశాలు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వరుసగా కాల్స్ వస్తున్నాయి. ఇవన్నీ స్పామ్ కాల్స్. ఎట్టి పరిస్థితుల్లో వాటిని లిఫ్ట్ చేయకూడదని చెబుతున్నారు నిపుణులు. కొంతమందికి వాట్సాప్ మెసేజీలు కూడా వస్తున్నాయి. అలాంటి వాటికి స్పందించకూడదని చెబుతున్నారు.

ప్రస్తుతం చాలామంది, తమకు వచ్చిన ఇంటర్నేషనల్ కాల్స్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ కాల్స్ ఎందుకొస్తున్నాయి, ఎత్తితే ఏమౌతుందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ ను విస్మరించడమే మంచిదని చాలామంది సలహాలిస్తున్నారు.

మన నంబర్లు ఎలా వెళ్లాయి?

కొన్ని నెలల కిందట ఫేస్ బుక్ ఖాతాల నుంచి లెక్కలేనన్ని ఫోన్ నంబర్లు స్కామర్లకు అందాయి. అదో పెద్ద కుంభకోణం. దాదాపు అదే టైమ్ లో ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ పై కూడా హ్యాకింగ్ జరిగి, లక్షలాది భారతీయుల నంబర్లు బయటకొచ్చాయి. ఈ డేటా మొత్తాన్ని కొంతమంది కొన్ని అంతర్జాతీయ ఏజెన్సీలకు అమ్మేశారనేది నిజం. అలా చాలామంది వ్యక్తుల వ్యక్తిగత మొబైల్ నంబర్లు, ఇప్పుడు అంతర్జాతీయ ఏజెన్సీల చేతికి చేరాయి. వాటి నుంచి స్పామర్లు, ఆన్ లైన్ మోసాలకు పాల్పడేవారికి ఈ నంబర్లు వెళ్లాయి.

ఇప్పుడేం చేయాలి..?

ఇలాంటి గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్ వచ్చిన వెంటనే వాటిని లిఫ్ట్ చేయకూడదని సూచిస్తున్నారు చాలామంది. కాల్ కట్ అయిన వెంటనే సదరు నంబర్ ను వెంటనే బ్లాక్ చేయాలని చెబుతున్నారు. బ్లాక్ చేసిన వెంటనే 'రిపోర్ట్' అనే ఆప్షన్ వస్తుందని, దాన్ని కూడా క్లిక్ చేయాలని సూచిస్తున్నారు.

అయితే ప్రస్తుతం చాలామంది వాట్సాప్ యూజర్లకు ఎడతెరిపి లేకుండా ఇలాంటి కాల్స్ వస్తూనే ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలంటూ వాట్సాప్ ను ట్యాగ్ చేస్తూ లెక్కలేనన్ని పోస్టులు కనిపిస్తున్నాయి.