బాడీ కాదు.. బౌండెడ్ స్క్రిప్ట్ ముఖ్యం

కథలో ఆత్మ లేనప్పుడు ఎన్ని హంగులు జోడించినా ఉపయోగం ఉండదు, ఫలితం శూన్యం. దశాబ్దాలుగా నిరూపితమౌతున్న సత్యం ఇది. ఇలాంటి హంగుల్లో ఒకటి సిక్స్ ప్యాక్. అల్లు అర్జున్ నుంచి నేటి కుర్రహీరోల వరకు…

కథలో ఆత్మ లేనప్పుడు ఎన్ని హంగులు జోడించినా ఉపయోగం ఉండదు, ఫలితం శూన్యం. దశాబ్దాలుగా నిరూపితమౌతున్న సత్యం ఇది. ఇలాంటి హంగుల్లో ఒకటి సిక్స్ ప్యాక్. అల్లు అర్జున్ నుంచి నేటి కుర్రహీరోల వరకు చాలామంది సిక్స్ ప్యాక్స్ సాధించారు. కానీ కేవలం ఈ సిక్స్ ప్యాక్ వల్ల విజయం దక్కదు. బాడీ కంటే బౌండెడ్ స్క్రిప్ట్ ముఖ్యం.

ఏజెంట్ సినిమా కోసం తొలిసారి సిక్స్ ప్యాక్ సాధించాడు అఖిల్. ఈ మూవీ కోసం అఖిల్ ట్రాన్స్ ఫర్మేషన్ చూస్తే వావ్ అనిపిస్తుంది. కానీ ఏం ఉపయోగం? కథలో దమ్ము లేదు. మేకింగ్ లో క్లారిటీ లేదు. ఫలితంగా అఖిల్ సిక్స్ ప్యాక్ వృధా అయింది. మంచి నీళ్లు కూడా మోతాదులో తాగుతూ సంపాదించిన సిక్స్ ప్యాక్ తో ఎలాంటి లాభం దక్కలేదు.

కొన్నాళ్ల కిందట వచ్చిన లైగర్ ది కూడా ఇదే పరిస్థితి. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కూడా మంచి ఫిజిక్ సంపాదించాడు. మార్షల్ ఆర్ట్స్ లో ట్రయినింగ్ కూడా తీసుకున్నాడు. కానీ పూరి జగన్నాధ్ ఎప్పట్లానే స్క్రిప్ట్ ను పైపైన రాసుకున్నాడు, క్లయిమాక్స్ అయితే దారుణం. దీంతో  విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ కష్టం, బూడిదలో పోసిన పన్నీరైంది.

ఇలా చెప్పుకుంటే, మిస్ ఫైర్ అయిన సిక్స్ ప్యాక్ ప్రయోగాలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య గని సినిమా కోసం వరుణ్ తేజ్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేశాడు. చివరికి ఆ సినిమా డిజాస్టర్ అయ్యేసరికి, ఓపెన్ గా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అలా వరుణ్ తేజ్ కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయాడు.

అంతకంటే ముందు సందీప్ కిషన్ కూడా మైఖేల్ సినిమాతో ఇలాంటి దెబ్బలు తిన్నాడు. స్క్రిప్ట్ సరిగ్గా లేని మైఖేల్ మూవీ కోసం అష్టకష్టాలు పడి ఆరు పలకల దేహం సాధించాడు. సినిమా ఫ్లాప్ అయి చాన్నాళ్లయింది, అతడి ముఖం మాత్రం ఇంకా మునుపటి స్థాయికి రాలేదు.

ఈ లిస్ట్ లో నితిన్, నాగశౌర్య, నాగార్జున లాంటి హీరోలు కూడా కొంతమంది ఉన్నారు. కథను విస్మరించి, కేవలం కండలపై దృష్టిపెట్టి ఫ్లాపులు తెచ్చుకున్నారు.