అది ఫ్లాప్ సినిమా కాదు.. నా పెట్టుబడి

ప్రతి హీరో కెరీర్ లో హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి. ఫ్లాప్ సినిమాల్ని అంగీకరించే హీరోల్లో నాగచైతన్య ఒకడు. ఓపెన్ గా మాట్లాడే ఈ హీరో, తొలిసారి తను హిందీలో చేసిన లాల్ సింగ్…

ప్రతి హీరో కెరీర్ లో హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి. ఫ్లాప్ సినిమాల్ని అంగీకరించే హీరోల్లో నాగచైతన్య ఒకడు. ఓపెన్ గా మాట్లాడే ఈ హీరో, తొలిసారి తను హిందీలో చేసిన లాల్ సింగ్ చద్దాను ఫ్లాప్ అంటే మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే, అది తన కెరీర్ కు పెట్టుబడి లాంటి సినిమా అంటున్నాడు.

“లాల్ సింగ్ చద్దా తెలుగు వెర్షన్ నేను చూడలేదు, హిందీ వెర్షనే చూశాను. సినిమా ఫ్లాప్ అయింది, నేను సాకులు చెప్పను. ఆ ప్రాజెక్టు చేయడానికి మెయిన్ రీజన్ అమీర్ ఖాన్. ఓ నటుడిగా ఆయనతో ట్రావెల్ అవ్వాలనే కోరికతోనే ఆ సినిమా చేశాను. 2 రోజులు ట్రావెల్ అయినా చాలు, చాలా నేర్చుకోవచ్చు. అలాంటిది ఏకంగా 5-6 నెలల జర్నీ ఆయనతో నాకు దక్కింది. చాలా నేర్చుకున్నాను. ఆ సినిమా ఫ్లాప్ అయినా, ఆ జర్నీ నుంచి వ్యక్తిగతంగా-వృత్తిపరంగా మారిన మనిషిలా నేను బయటకొచ్చాను.”

లైఫ్ లో కొన్నింటిని ఫ్లాపులుగా చూడకూడదని… పెట్టుబడిగా చూడాలని చెబుతున్న నాగచైతన్య, అమీర్ తో జర్నీని తన భవిష్యత్ పెట్టుబడిగా చెప్పుకొచ్చాడు. కెరీర్ పరంగా అమీర్ నుంచి సినిమా ప్రాసెస్ ను నేర్చుకున్నానని, వ్యక్తిగతంగా మరిన్ని విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు.

భవిష్యత్తులో మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తానా లేదా అనే విషయాన్ని చెప్పలేనని.. ప్రస్తుతానికి మాత్రం తన ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే ఉందని స్పష్టం చేశాడు చైతూ. ఈ హీరో నటించిన కస్టడీ సినిమా, ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది.