నా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వండి ఫ్లీజ్ -విలక్ష‌ణ హీరో

ప్ర‌ధాని మోడీని విల‌క్ష‌ణ అగ్ర హీరో, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు  క‌మ‌ల్‌హాస‌న్ గ‌ట్టిగా నిల‌దీశారు. సుమారు రూ.1000 కోట్ల‌తో పార్ల‌మెంట్ నూత‌న భ‌వ‌నాన్ని నిర్మించేందుకు ఇటీవ‌ల ప్ర‌ధాని శంకుస్థాప‌న చేసిన నేప‌థ్యంలో…

ప్ర‌ధాని మోడీని విల‌క్ష‌ణ అగ్ర హీరో, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు  క‌మ‌ల్‌హాస‌న్ గ‌ట్టిగా నిల‌దీశారు. సుమారు రూ.1000 కోట్ల‌తో పార్ల‌మెంట్ నూత‌న భ‌వ‌నాన్ని నిర్మించేందుకు ఇటీవ‌ల ప్ర‌ధాని శంకుస్థాప‌న చేసిన నేప‌థ్యంలో ట్విట‌ర్ వేదిక‌గా క‌మ‌ల్‌హాస‌న్ విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టారు. 

దేశ ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తుంటే, వంద‌ల కోట్లు వెచ్చించి నూత‌న పార్ల‌మెంట్ క‌ట్టాల్సిన అవ‌స‌రం ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ద‌య‌చేసి త‌న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వాల‌ని క‌మ‌ల్ కోరారు. ప్ర‌ధానిని నిల‌దీస్తూ సాగిన ఆ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.

‘దేశంలో సంగం మందికి తిన‌డానికి తిండిలేదు. దీంతో ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. కరోనా వైరస్ ప్ర‌తి ఒక్క‌రి జీవితాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది.  మీరేమో రూ.1000 కోట్లతో కొత్త పార్లమెంట్‌ నిర్మాణానికి రూపకల్పన చేశారు. గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనా నిర్మించే క్రమంలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు విడిస్తే.. ప్రజల్ని రక్షించేందుకే  ఆ భారీ నిర్మాణం చేపట్టామని చైనా పాలకులు సెలవిచ్చారట. 

మీ ధోరణి కూడా అలాగే ఉంది. ఎవరిని రక్షించేందుకు మీరు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. దయచేసి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ప్రధాన మంత్రి మోదీ గారు’అని కమల్‌ సూటిగా ప్రశ్నించారు.

64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించ‌త‌ల‌పెట్టిన పార్ల‌మెంట్ నూత‌న భ‌వ‌నానికి ఈ నెల 10న ప్ర‌ధాని శంకుస్థాప‌న చేశారు.  ఈ ప్రాజెక్టు అంచనా దాదాపు రూ.971 కోట్లు. ఈ నిర్మాణాన్ని 2022కి పూర్తి చేయాలని భావిస్తున్నారు.  

కాగా నిర్మాణ కాంట్రాక్ట్‌ను  టాటా ప్రాజెక్ట్స్ ద‌క్కించుకొంది. ప్ర‌ధానిని నిల‌దీస్తూ క‌మ‌ల్ ట్వీట్ చేయ‌డం ఇదేమీ కొత్త‌కాదు. ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌ధానిపై భార‌తీయుడు సినిమా హీరో క‌మ‌ల్‌హాస‌న్  ప్ర‌శ్న‌ల వ‌ర్షాన్ని కురిపిస్తూనే ఉన్నారు.  

కాగా వ‌చ్చే ఏడాది మే నెల‌లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌దురై నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు  క‌మ‌ల్‌హాస‌న్ త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు. 

అవినీతి, నిరుద్యోగం, గ్రామీణాభివృద్ధి, తాగునీరు త‌దిత‌ర అంశాలు ప్ర‌ధాన ఎజెండాగా ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. మ‌రోవైపు మ‌రో అగ్ర‌హీరో ర‌జ‌నీకాంత్ కూడా ఈ నెలాఖ‌రులో నూత‌న పార్టీని ప్ర‌క‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. సినిమా హీరోల ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఏ మేరకు ప‌డ‌నుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.  

అటూ ఇటూ ఎటూ కాలేక!