‘కమ్మం’ అంటున్నారు

ఖమ్మం ..మరోసారి వార్తల్లోకి వస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మద్దతు వుంటుంది, వుంది అనుకునే ఖమ్మం తెలంగాణ విభజన తరువాత ఆ తరహా వార్తలకు దూరంగా వుంది. తెలుగుదేశం నుంచి తెరాస లోకి జంప్…

ఖమ్మం ..మరోసారి వార్తల్లోకి వస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మద్దతు వుంటుంది, వుంది అనుకునే ఖమ్మం తెలంగాణ విభజన తరువాత ఆ తరహా వార్తలకు దూరంగా వుంది. తెలుగుదేశం నుంచి తెరాస లోకి జంప్ జిలానీలు అన్నారు చాలా మంది. కొందరు పదవులు అందుకున్నారు. కొందరు తెరాసకు, కుల పెద్దలకు మధ్య రాజీ కుదిర్చే పని పెట్టుకున్నారు అప్పట్లో. ఆ తరువాత సైలంట్ గా పనులు చక్కబెట్టుకుంటూ వచ్చారు. మరే హడావుడి లేదు.

కానీ తెలంగాణలో తమకు బలం వుందని చూపించి, ఆ బలం మీకు కావాలంటే ఆంధ్రలో తమకు అండగా వుండాలనే సంకేతాలు ఇచ్చేందుకు ఆ మధ్య తెలుగుదేశం ఖమ్మంలోనే బల ప్రదర్శన చేసింది. అప్పటికన్నా తెరాసకు తెలిసి రావాల్సి వుంది తెలుగుదేశం పునాదుల్లో వున్న మద్దతు వర్గం వైఖరి ఎలా వుంటుందో? అందితే జుత్తు..అందకుంటే కాళ్లు అనే టైపు అనే అనుమానాలు పొడసూపాయి.

ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఇన్నాళ్లూ తెలంగాణలో తెరాస వెనుక వున్న తేదేపా అనుకూల మీడియా వ్యతిరేక బాణీ వినిపించడం మొదలు పెట్టింది. దీని వెనుక కారణం ఏమై వుంటుంది అన్నది పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకుని మరీ తెలుసుకోనక్కరలేదు. మరో పక్కన ఖమ్మంలో కూడా తమ బలం, బలంగం చూపించుకునే, పెంచుకునే పనిలో పడింది ఈ వర్గం. 

ఖమ్మంలో భారీ ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పడం పూర్తి చేసారు. ఎన్టీఆర్ పుట్టిన జిల్లాకు ఆయన పేరు పెట్టలేకపోయారు. జగన్ ఆ పని చేసాడు. పోనీ భారీ విగ్రహం కూడా అదే జిల్లాలో పెట్టే ప్రతిపాదన చేస్తే జగన్ కాదనే వాడు కాదేమో?

కానీ ఈ వర్గానికి మొదటి నుంచీ ఇదే తంతు. వేరే ఏరియాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టి, చాపకింద నీరులా వ్యాపించడం. విశాఖలో అర్థరాత్రి చడీ చప్పుడు లేకుండా ఎన్టీఆర్ విగ్రహం పెట్టేసారు గతంలో. ఒకసారి పెట్టిన తరువాత ఇక తీయరు కదా. తీస్తే నానా యాగీ చేయచ్చు కదా.

ఇప్పుడు ఖమ్మంలో ఈ విగ్రహం పెట్టడం పై తెలంగాణ వాదులు మెలమెల్లగా గళం విప్పడం ప్రారంభిస్తున్నారు. దీని వెనుక మతలబు, రాజకీయం ఏమిటని వ్యాఖ్యానాలు రాస్తున్నారు. మెల్లగా తీగ కదులుతోంది. తెరాస ఈ తీగను ఇప్పట్లో పట్టుకోదు. ఎందుకంటే ఎన్నికల టైమ్ కదా. 

కానీ తీరా ఎన్నికలు అయ్యాక, తెరాస అధికారంలోకి వస్తే, అదే వర్గం అన్నీ కట్టిపెట్టి, సైలంట్ గా వుండిపోతుంది. అదో విద్య. అందరికీ రాదు.