టీడీపీ గురించి జూనియర్ అయ్యన్న జోస్యం …?

తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. యువకుడిగా వచ్చిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారు ఇప్పుడు ఆరున్నర పదుల వయసు దాటేశారు. నాడు పైలా పచ్చీస్ వయసులో రాజకీయ అరంగేట్రం చేసిన …

తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. యువకుడిగా వచ్చిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారు ఇప్పుడు ఆరున్నర పదుల వయసు దాటేశారు. నాడు పైలా పచ్చీస్ వయసులో రాజకీయ అరంగేట్రం చేసిన  నేతలు అంతా ఇపుడు వయో వృద్ధులైపోయారు. టీడీపీ నిండా సీనియర్లు ఉన్నారు. వారే ఈ రోజుకు పార్టీని శాసిస్తున్నారు.

ఇక కొత్త నీరు, కొత్త రక్తం, యువతరం అంటే వారి వారసులే ముందు వరసలోకి వస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఎక్కడికక్కడ వారసులు సై అంటున్నారు. విశాఖ జిల్లా నర్శీపట్నంలో చూసుకుంటే అయ్యన్నపాత్రుడుకి ఇద్దరు కొడుకులు. ఇద్దరూ టీడీపీలో తమ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

పెద్ద కుడుకు విజ‌య్ పాత్రుడు చేస్తే  ఎమ్మెల్యేగానే అంటూ ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ  పోటీ చేయలేదు. చిన్న కొడుకు రాజేష్ పాత్రుడు అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి అలా పైకి వస్తున్నారు. ఆయన నర్శీపట్నం మునిసిపాలిటీ కౌన్సిలర్ గా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచారు. దాంతో ఆయన ఇపుడు రాజకీయంగా దూకుడు బాగా చేస్తున్నారు.

టీడీపీ ఫ్యూచర్ గురించి రాజేష్ పాత్రుడు ఇపుడు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని ఈ విషయంలో ఎవరూ ఎలాంటి డౌట్లూ పెట్టుకోనవసరం లేదని కూడా రాజేష్ పాత్రుడు అంటున్నారు. తన తండ్రి అయ్యన్న సహా టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి వారికి చెవులకు ఇంపుగా ఉండేలా ఇలాంటి జోస్యాలను జూనియర్ వదులుతున్నారు.

ఎపుడు ఎన్నికలు జరిగిగా ఏపీలో ఎగిరేది టీడీపీ జెండా మాత్రమేనని స్ట్రాంగ్ గానే చెప్పేశారు. బడుగు బలహీనుల కోసం పెట్టిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీయేనని కూడా వైసీపీ మీద జనాలకు భ్రమలు తొలగిపోతున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి జూనియర్ దూకుడు అచ్చం తండ్రి మాదిరిగానే ఉందని తమ్ముళ్ళు సంబరపడుతున్నారు. గెలుపు పిలుపు ఒక్కసారే వినిపిస్తుంది. కానీ ఆ గెలుపు గురించి పదే పదే లీడర్ అన్న వాడు కలవరించాలి. మరి ఆ విధంగా చూస్తే పాతికేళ్లకే రాజకీయంగా జోరు చేస్తున్న జూనియర్ అయ్యన్న టీడీపీకి తీయని కబుర్లు బాగానే చెబుతున్నారు అనుకోవాలి.

గెలుపు సంగతి పక్కన పెడితే ఇపుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆశని కూడా నేతలు కలిగించడానికి ఎందుకో వెనకాడుతున్న నేపధ్యం ఉంది. అలాంటిది జూనియర్ అయ్యన్న మాత్రం ఢంకా భజాయిస్తున్నాడు అంటే తండ్రికి అసలైన వారసుడు ఇతడేనా అని తమ్ముళ్ళు కూడా చర్చించుకుంటున్నారుట. ఇక్కడో పాయింట్ ఉంది. గెలుపు టీడీపీ అన్న పిలుపు మాత్రం చంద్రబాబు చెవులను తాకేలాగే ఉందంటున్నారు. సో ఈ జూనియర్ కి మాత్రం ఫ్యూచర్ చాలానే ఉన్నట్లుంది అనుకోవాలి.