మాజీ ముఖ్యమంత్రి. టీడీపీ అధినేత చంద్రబాబు పరువును ఎల్లో మీడియా తీసేస్తోంది. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామమైన నారావారిపల్లెలో సొంత స్థలాన్ని కూడా కాపాడుకోలేని అసమర్థుడు చంద్రబాబు అని ఆయన్ను ఎంతో ఆరాధించే ఎల్లో మీడియా ప్రచారం చేయడం విశేషం.
చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చెందిన 38 సెంట్ల స్థలాన్ని ఆక్రమించారనే ప్రచారం తాజాగా వెలుగు చూసింది. 1989లో చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు అదే గ్రామానికి చెందిన కృష్ణమనాయుడు భార్య సిద్ధమ్మ వద్ద 87 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు.
అందులో కొంత స్థలాన్ని ఆస్పత్రి నిర్మాణం, ఇతరత్రా అవసరాలకు వితరణ చేశారు. మిగిలిన 38 సెంట్ల స్థలాన్ని ఆక్రమించేందుకు రాజేంద్రనాయుడు అనే వ్యక్తి ప్రయత్నించారు. గతంలో భూమి అమ్మిన కృష్ణమనాయుడు, సిద్ధమ్మ దంపతుల కుమారుడే రాజేంద్రనాయుడు. రోడ్డుకు పక్కనే ఉన్న ఈ స్థలం తమదే అని అతను ఏకంగా రాతి స్తంభాలను కూడా నాటుతున్నాడు.
తమ స్థలం ఆక్రమణపై చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు భార్య ఇందిరమ్మ చంద్రగిరి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా వుండగా ఏకంగా చంద్రబాబు స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారని ఎల్లో మీడియా రచ్చ చేస్తోంది. గ్రామంలో చంద్రబాబు కుటుంబానికి బంధువులతో ఏర్పడిన స్వల్ప భూవివాదాన్ని కూడా వైసీపీ మెడకు చుట్టేందుకు ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. నేరుగా వైసీపీ, ఏపీ ప్రభుత్వంపై నిందలు మోపడానికి అవకాశాలు లేక, వెనుక ఉండి నడిపిస్తున్నారనే ప్రచారానికి తెరపైకి తేవడం గమనార్హం.
ఇదిలా వుండగా ఈ స్థలం వివాదంపై మరో వాదన తెరపైకి వచ్చింది. రాజకీయ, అధికార పలుకుబడిని ఉపయోగించుకుని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. కంచె వేసి, రాతి స్తంభాలు నాటుతున్నా చంద్రబాబు బంధువులు, టీడీపీ నాయకులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇదిలా వుండగా కనీసం తన సొంత స్థలాన్ని, అది కూడా స్వగ్రామంలో కాపాడుకోలేని చంద్రబాబు, ఇక రాష్ట్రాన్ని, పార్టీని ఏ విధంగా పరిరక్షించుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రచారంతో పోయేది చంద్రబాబు పరువే అని ఎల్లో మీడియా గుర్తించాలని నెటిజన్లు కోరుతున్నారు.