ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటికొస్తే చాలు రచ్చరచ్చ చేయడానికి కొన్ని శక్తులు మీడియా ముసుగులో పొంచుకుని ఉన్నాయి. జగన్ క్యాంప్ కార్యాలయానికే పరిమితమైతే, దానిపై ఇంకో రకం విమర్శ. రాజప్రసాదానికే పరిమితమయ్యారని, ఒక్కసారి బయటికి రావాలని విమర్శలు. ఆయన బయటికొచ్చి, అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొన్నా, వాటికి సంబంధించిన సమాచారానికి బదులు పొంతనలేని న్యూసెన్స్ విషయాలను తెరపైకి తేవడం వారికే చెల్లింది.
ఇవాళ గుంటూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం, అలాగే తాడేపల్లి మండలంలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రానికి భూమిపూజ నిర్వహణ కార్యక్రమాలను ఆయన పూర్తి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో దళిత హోంమంత్రి సుచరితకు అవమానం జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం. సీఎంతో పాటు పాల్గొనే కార్యక్రమాల్లో హోంమంత్రి సుచరిత, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు, అలాగే గుంటూరు ఎంపీ గల్లా జయదేశ్ పేర్లను ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకాల్లో వేయలేదంటూ రచ్చరచ్చ చేయడం గమనార్హం.
సీఎం జగన్ ప్రారంభించే కార్యకలాపాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాల కంటే, రాజకీయంగా అప్రతిష్టపాలు చేసేందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేయడం ప్రతిపక్షాల కొమ్ము కాసే మీడియాకే చెల్లింది. పైగా జగన్ అవమానించారని ప్రచారం చేసే సందర్భంలో మాత్రమే దళిత హోంమంత్రి సుచరిత అని గుర్తుకు రావడం విశేషం.
ఓ దళిత మహిళా ఎమ్మెల్యేని హోంమంత్రి చేశారని ఎన్నడూ ప్రశంసించని వాళ్లు, అవమానించే విషయంలో మాత్రం గుర్తు పెట్టుకోవడంలో ఉద్దేశాన్ని పసిగట్టొచ్చు. కనీసం జగన్‌ను విమర్శించడానికైనా సుచరితను హోంమంత్రిగా గుర్తించినందుకు సంతోషమని వైసీపీ నేతలు అంటున్నారు.