ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ఉపాధి కల్పనలో ఏపీ రోజురోజుకూ దిగజారిపోతోందన్న నివేదిక ప్రతిపక్షాలకు ఆయుధ మైంది. దీంతో జగన్‌పై ముప్పేట దాడికి తెగబడుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ యువనేత నారా లోకేశ్ కాస్త దూకుడు ప్రదర్శించారు. ఏ చిన్న అవకాశం దొరికినా జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడానికి లోకేశ్ కాచుకుని వుంటారు.
ఉద్యోగాల కల్పనలో ఏపీ పరిస్థితి దిగజారిందని ఓ నివేదిక వెల్లడించారు. ఇటీవల భారత నైపుణ్యాల నివేదిక-2022 వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం చంద్రబాబు పాలించే రోజుల్లో 2018లో ఏపీకి మొదటి స్థానం దక్కింది. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2019లో కూడా అదే స్థానం కొనసాగింది. అనంతరం జగన్ పరిపాలన పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన కాలంలో … 2020లో 4వ స్థానం, 2021లో 5వ స్థానం, 2022లో 7వ స్థానానికి ఏపీ దిగజారింది.
ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుని నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. తలెక్కడ పెట్టుకుంటావు జగన్ అని నిలదీయడం గమనార్హం. దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న జగన్‌రెడ్డి గారు, మూడేళ్లు పూర్తికాకుండా దేశమేం ఖర్మ, ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారని లోకేశ్ వెటకరించారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాలకు నెంబర్ వన్‌గా ఉన్న ఏపీని ఒక్క చాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్‌కి దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం, ఆంగ్ల పరిజ్ఞానం శూన్యం అని జాతీయ నైపుణ్యాల నివేదిక-2022 వెల్లడించిందని ఆయన చెప్పుకొచ్చారు. ‘తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు జగన్ గారు! ఉద్యోగాల కల్పన అంటే మీ కుటుంబానికి, కులానికి నామినేటెడ్ పదవులు ఇచ్చినంత సులువు కాదు జగన్ రెడ్డి గారు’ అని దెప్పి పొడిచారు.
ఆంధ్రప్రదేశ్ పునఃనిర్మాణమంటే ప్రజావేదిక కూల్చినంత సులువు కాదు ముఖ్యమంత్రి గారూ అంటూ లోకేశ్ వ్యంగ్యోక్తులు విసిరారు. ఏపీలో సంక్షేమ పాలనతో పాటు అభివృద్ధి, ఆదాయ వనరులను పెంచుకోవడంపై జగన్ దృష్టి సారించాలని పదేపదే ప్రజానీకం నుంచి వస్తున్న అభిప్రాయాలు. ఇప్పటికే సగం పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇక మిగిలిన రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపైనే అతని అదికారం ఆధారపడి వుంటుంది.