టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బాగా డల్ అయ్యారు. ఒకప్పట్లా ఆయనలో దుడుకుతనం కనిపించడం లేదు. తాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిననే ఉనికిని కాపాడుకునేందుకు అన్నట్టు …సమయం, సందర్భం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఏపీలో ఇళ్ల నిర్మాణాలపై అచ్చెన్నాయుడు తాజాగా మాట్లాడ్డం అరిగిపోయిన రికార్డ్ ను తలపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చు కుందని విమర్శించారు. తమ హయాంలో 3,16,000 ఇళ్లను ప్రారంభించి 2,62,000 పూర్తి చేశామన్నారు. పేదవాడి ఇంటిపై కూడా వైసీపీకి ధనదాహం ఉందని ఆగ్రహించారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకిచ్చిన భూములు చెరువులను తలపిస్తున్నాయన్నారు.
జగనన్న కాలనీ స్థలాలు ఇవ్వకుండా టీడీపీ కోర్టుల్లో కేసు వేసిందని చెప్పడం అబద్ధని ఆయన నమ్మబలికారు. పేదలకు ఇచ్చిన స్థలాలకు తాము అడ్డుపడలేదని ఆధారాలతో నిరూపించామన్నారు. ఇళ్ల సమస్యలపై గత రెండేళ్లుగా ఇదే రకమైన విమర్శలను టీడీపీ చేస్తోంది. వాటిని పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం తన పని చేసుకుపోతోందన్నారు.
ఒకేసారి 23 లక్షల మందికి పైగా ఇంటి స్థలాలను పంపిణీ చేసిన ఘనతను జగన్ సర్కార్ దక్కించుకుంది. అయితే ఇళ్ల నిర్మాణంలో పలు దఫాలుగా జగన్ ప్రభుత్వం వేసిన పిల్లిమొగ్గలపై మాత్రం జనం నుంచి విమర్శలొస్తున్నాయి. ఒక రోజు తామే కట్టిస్తామని, ఇంకోరోజు బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తామని, సొంతంగా కట్టుకోవాలని …ఇలా అనేక రకాల వాదనలను వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.
దీంతో ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందన్న నమ్మకాన్ని లబ్ధిదారులు కోల్పోయారు. అచ్చెన్నాయుడు చెబుతున్నట్టు 1983 నుంచి పేదలకు బాసటగా టీడీపీ నిలిచే వుంటే, ఇంకా ఇప్పటికీ ఇళ్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆయనే చెప్పాలి. రోజువారీ కొత్తకొత్త సమస్యలపై స్పందించకుండా, అయిపోయిన పెళ్లికి అచ్చెన్న మేళం ఏంటో అర్థం కావడం లేదు.