టైటిల్: సన్ ఆఫ్ ఇండియా
రేటింగ్: 1/5
తారాగణం: మోహన్ బాబు, మీనా, ప్రగ్యా, మంగ్లీ, శ్రీకాంత్, పోసాని, ఆలి, బండ్ల గణేష్, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు
కెమెరా: సర్వేష్ మురారి
ఎడిటింగ్: గౌతం రాజు
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: విష్ణు మంచు
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
విడుదల తేదీ: 18 ఫిబ్రవరి 2022
చిరంజీవి వాయిసోవర్ లో మోహన్ బాబు పాత్ర పరిచయం చేయడంతో సినిమా మొదలవుతుంది. గంటా నలభై నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ ఫీచర్ ఫిల్మ్ కి తక్కువ అన్నట్టుగా ఉన్న ఈ సినిమా ఎలా ఉందంటే…
అసలిందులో కథ ఒకటే లైన్లో చెప్పేయొచ్చు. తన కుటుంబానికి అన్యాయం చేసిన విలన్లని హీరో చంపడం, జైలుకెళ్లడం, జైలునుంచి బయటికొచ్చి ఇతర నిర్దోషులకి అన్యాయం చేసిన వాళ్లని చంపుకుంటూ పోవడం.. అంతే.
ఈ కథ ఎన్ని వందలసార్లు తెలుగు తెరమీద చూసాం? అయినా పర్లేదు. నేపథ్యం, ట్రీట్ మెంట్, ఎలా అన్యాయం చేయబడ్డాడు అనే విషయాల్లో ఎక్కడన్నా కొత్తదనం ఉందా అంటే మైక్రోస్కోపేసి చూసినా కనపడదు.
2020 లో విడుదలవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ నేటికి విడుదలయ్యింది. 16 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇందులో ఫ్లాష్ బ్యాక్ గా వస్తుంది. అంటే 2004లో జరిగే కథ. ఆ ఫ్లాష్ బ్యాక్ లో హీరోకి ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. అక్షరాల్ని కంపోజ్ చేసి, డై తయారు చేసి మెషీన్లో పెట్టి ప్రింట్ తీసే ప్రెస్సది. డీటీపీ వచ్చాక ఆ టైపు ప్రెస్సులు ఎప్పుడో 2000 సంవత్సరానికి ముందే కనుమరుగైపోయాయి. అయినా ఆ పాత సెటప్పునే ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు. దానివల్ల కథకి కొత్తగా ఒనగూరే ప్రయోజనం కూడా లేదు. కనుక కథే కాదు నేపథ్యం కూడా ఔట్ డేటెడ్డే.
మోహన్ బాబు ఎప్పుడూ తన డయలాగ్ డెలివెరీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. ఇక్కడ డెలివెరీలో మాడ్యులేషన్ ఉంది కానీ మ్యాటర్ అస్సలూ లేదు. మ్యాటర్ లేని డయలాగులన్నీ పోతపోసి ఇందులో పెట్టినట్టుంది. కెరీర్ లో అన్నేసి డయలాగులు చెప్పిన మోహన్ బాబైనా ఏది పేలుతుందో ఏది పేలదో జడ్జిమెంట్ చేసుకోలేకపోయారా అని బాధేస్తుంది.
లివిన్ రిలేషన్ గురించి చెబుతూ – “పెళ్ళైతే రోజూ ఒక్కటే స్టాంపు వెయ్యాలి, లివిన్ రిలేషన్ అయితే రొజుకొక స్టాంపు వేయొచ్చు” అని మాంచి మాడ్యులేషన్ తో చెప్పారు. అసలేవిటీ డయలాగ్? సన్నాఫ్ ఇండియా గా చెప్పాల్సిన లైనా ఇది?
కష్టం గురించి ఎన్.ఐ.ఏ ఆఫీసరైన హీరోయిన్ తో చెబుతూ- “…చాలా కష్టాలున్నాయి..తొలి వలపు కష్టం, తొలి కానుపు కష్టం, తొలిరాత్రి కూడా కష్టమే” అంటూ మరొక డయలాగొదిలారు.
ఏంటండి ఇది మోహన్ బాబు గారు? సమయం, సందర్భం, సన్నివేశం డిమాండ్ ఏదీ లేకుండా దేనికోసం ఈ డయలాగ్స్? ప్చ్!
సడన్ గా కులాలగురించి ఒక పెద్ద డయలాగ్..అది కూడా దానవీరశూరకర్ణ డయలాగ్ కి కొనసాగింపులాగ ఉంటుంది. ఎవరు ఎవరికి పుట్టారు, ఎవరి కులం ఏవిటి…మనిషికి విలువ పుట్టకతో కాదు జ్ఞానంతో వస్తుంది అనేది అందులో సారాంశం. ఈ సన్నివేశంలో దర్శకుడు ఏ రసం పండిద్దామనుకున్నాడో తెలియదు కానీ చూసే వాళ్లకి మాత్రం నీరసం వచ్చింది. ఈ సీన్లో డయలాగ్ చెబుతూనే మోహన్ బాబు గారు విశ్వరూపసందర్శనం టైపులో పెద్దగా అయిపోతారు. అది ఎదురుకుండా ఈ డయలాగ్ వినే వ్యక్తి పాయింటాఫ్ వ్యూవ్ అన్నమాట. ఉఫ్!
సినిమాలో ఎక్కడా కూడా మనసుకు హత్తుకునే సన్నివేశముండదు. ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా కనిపించిన మంగ్లీ యూనిఫాములో ఉండగానే అకస్మాత్తుగా జానపద బాణీలో ఏవో కామెడీ పాటలు పాడుతుంటుంది.
సినిమా నడుస్తుండగా మధ్యలో రాం గోపాల్ వర్మ “డేన్జరెస్” రీలేస్తున్నారేమో అనిపిస్తుంది. అదే…ఇద్దరు లేడీ క్యారెక్టర్స్ చేత లోదుస్తులు ఒలిపించి లెజ్బియన్ సీనొకటి పెట్టారు. అసలీ కథకి ఆ సీను అవసరమేంటో తెలీదు. సినిమా అన్నాక “సీన్లుండాలి” అనే సి-సెంటర్ ఫార్ములాని ఫాలో అయిపోయినట్టుంది.
ఎన్.ఐ.ఏ వాళ్లు పెద్ద పెద్ద గన్స్ పట్టుకుని హీరోగారిని చుట్టుముడతారు. ఆయన గారు చుట్టూ బాంబులు పెట్టానని, కావాలంటే ఒక స్యాంపిల్ చూడమని రిమోట్ నొక్కుతాడు. బయటెక్కడో ఒక బాంబు పేలుతుంది. అదిరిపడిన ఎన్.ఐ.ఏ జవాన్లంతా తుపాకులు కిందపెట్టేసి హ్యాండ్సప్ పొజిషన్ కి వచ్చేస్తారు. ఆ సీన్లో మనం మన సన్నాఫ్ ఇండియా గారి హీరోయిజం మాత్రమే చూడాలి తప్ప ఎన్.ఐ.ఏ జవాన్లు అంత చేతకానివాళ్లా అనే లాజిక్ ని ఆలోచించకూడదు.
అసలీ సినిమా మేకింగే ఒక అద్భుతం. పాపులర్ నటీనటులెందరో ఉన్నా ఎవరూ చివరిదాకా కనపడకుండా తీసిన సినిమా ఇది.
సినిమా మొదట్లోనే డయలాగ్ కింగ్ వాయిసులో తాను చేసింది ఏకపాత్రాభినయమని, నటీనటులంతా వినిపిస్తారు తప్ప చివరిదాకా కనపడరని చెప్పేసి చూసేవాళ్లని ముందుగానే మెంటల్ గా ప్రిపేర్ చేసారు.
సునీల్, ఆలి, బండ్ల గణేష్, వెన్నెల కిషోర్, మీనా, పృథ్వి, శ్రీకాంత్, పోసాని, ప్రగ్న్యా జైల్వాల్, మంగ్లీ, రాజారవీంద్ర, శ్రీకాంత్ ఇలా చాలామంది తెర మీద ఉన్నా అందరివీ ఒకటి లేదా రెండు సీన్ల పాత్రలే. దీనిని బట్టి అందరూ కేటాయించింది ఒక్క రోజు కాల్షీటే అనే లెక్క అర్థమవుతుంది.
సినిమా అంతా అయ్యాక “మిషన్ కంటిన్యూస్” అంటూ మోహన్ బాబు గారి ఆఖరి డయలాగుంది. బహుశా సీక్వెల్ ప్లాన్ ఉందేమో! ఇళయరాజా సంగీతమని చెప్పి కేవలం ఒక్క పాటతో సరిపెట్టి, ప్రగ్యా జైస్వాల్ ఉందని చెప్పి ఆమెని క్లైమాక్స్ లో కాసేపు చూపించి.. ఫుల్ టికెట్ కి డబ్బులు వసూలు చేసి చూపించిన సగం సినిమాగా ఈ సినిమాని అభివర్ణించవచ్చు.
ఇందులో ఏకైక ప్లస్ పాయింట్ చెప్పాలంటే రఘువీరగద్యని ఇళయారాజా చేత కంపోజ్ చేయించి పెట్టడం. అంతే.
షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమాని ఫుల్ టికెట్ పెట్టి చూడడం మైనస్. అసలిలాంటి సినిమా అంత త్వరగా ముగిసిపోవడం ప్లస్. ఆ విధంగా ప్లస్ పాయింటూ, మైనస్ పాయింటూ ఒకటే అయిన అరుదైన సినిమా ఇది.
బాటం లైన్: ఏకపాత్రాభినయం ఆఫ్ ఇండియా