జనసేనతో కలిసి పని చేస్తాం…ఏపీ బీజేపీ నేతలు పదేపదే చెబుతున్న మాట. మాటే తప్ప, ఆచరణకు మాత్రం నోచుకోని బ్రహ్మపదార్థంగా తయారైంది. ఇంతకూ కలిసి పనిచేసేదెన్నడు అనే ప్రశ్నకు …ప్లీజ్ అదొక్కటీ అడగొద్దని ఇరుపార్టీల నేతలు చెబుతుండడం విశేషం.
జనసేనతో కలిసి పని చేయడంపై తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మరోసారి ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంత కాలానికి జనసేనాని మనసు మార్చుకున్నారు. అంత వరకూ వామపక్షాలతో పొత్తులో భాగంగా మిత్రత్వం సాగిస్తున్న జనసేనాని, వారికి రాజకీయ విడాకులు ఇచ్చారు.
ఆ తర్వాత బీజేపీపై ఆయన మరోసారి మనసు పడింది. ఢిల్లీస్థాయిలో పలు దఫాలుగా చర్చించి చివరికి పొత్తు కుదుర్చు కున్నారు. భవిష్యత్‌లో ఎన్నికల్లో పోటీతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడిగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని ఇరు పార్టీల నాయకులు గొప్పలు చెప్పారు. అమరావతి రాజధానిపై కావచ్చు, ఇతరత్రా అనేక అంశాలపై వేర్వేరుగానే బీజేపీ, జనసేన అప్పుడప్పుడు పోరాటాలు చేస్తున్నాయి.
తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతుగా జనసేనాని పవన్‌కల్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే బద్వేలు ఉప ఎన్నిక విషయానికి వస్తే బీజేపీ పోటీ చేయగా, జనసేన మాత్రం ఏదో సిద్ధాంతం చెప్పి, ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. బీజేపీకి మద్దతు ప్రకటించిందే తప్ప క్షేత్రస్థాయిలో జనసేన నాయకులెవరూ పని చేయలేదన్నది వాస్తవం. ఇక పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు మాటే లేదు.
విజయవాడలో ఒకట్రెండు చోట్ల పొత్తు కుదుర్చుకున్నా, ఫలితాలు వచ్చిన తర్వాత ఓటమికి మీరంటే మీరే కారణమని జనసేన, బీజేపీ నాయకులు పరస్పరం కత్తులు దూసుకున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జనసేనతో కలిసి పని చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించడం హాస్యాస్పదంగా మారింది. గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, జనసేన పార్టీల కూటమి ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందనే భయంతో కొన్ని పార్టీలు కుట్ర రాజకీయాలకు తెరలేపాయని విమర్శించారు.
అలాగే కాపు రిజర్వేషన్లపై కూడా ఆయన మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలో ఉందన్నారు. ఇవ్వాలా, వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని జీవీఎల్ అన్నారు. అలాగే విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవన్నీ రానున్న రోజుల్లో తీసుకొస్తామన్నారు.