మోహన్ బాబు..ఎలాంటి నటుడు. విలన్ గా ప్రారంభించి, హీరోగా మారి, నిర్మాతగా మారి, మంచి మంచి సినిమాలు చేసి, బ్లాక్ బస్టర్లు చవిచూసిన విలక్షణ నటుడు ఇవ్వాళ అతి దారుణంగా ట్రోల్స్ గురి కావడం. పోనీ ట్రోల్స్ అంటే కిట్టని వారి పని అనుకుంటే, అసలు టికెట్ లు తెగక వందలాది షో లు క్యాన్సిల్ కావడం. ఇంతటి పరాభవం చవిచూడడం నిజంగా భరించలేని కష్టం.
ఇప్పటికీ ఈ పరిస్థితికి తాము ఎంత వరకు కారణం అని స్వయం విమర్శ చేసుకోవడం లేదు. వేరే వాళ్లు ఎవరో కిట్టని వాళ్లు చేస్తున్న పని అని నింద వేసి ఆత్మ సంతృప్తి పొందుతున్నారు. నిజానికి ఒకప్పుడు ఎన్టీఆర్ తరువాత ఓ వర్గానికి సినిమా రంగ ప్రతినిధిగా మోహన్ బాబును చూసారు. పరిటాల రవితో వున్న సాన్నిహిత్యం, నందమూరి హరికృష్ణతో వున్న అనుబంధం ఇవన్నీ కలిసి మోహన్ బాబును ఓ స్థాయిలో వుంచాయి. సినిమాల సంగతి సరేసరి, నటన, వాచకం విషయంలో ఆయన స్టయిల్ ఆయనది.
విద్యారంగంలో మంచి విజయాలు సాధించారు. మంచి అభిరుచితో ఇల్లు కట్టుకున్నారు. అన్నీ బాగానే వున్నాయి. కానీ ఆయన కానీ ఆయన పిల్లలు కానీ ఇటు జనాల, అటు సినిమా జనాల, లేదా మీడియా జనాల అభిమానానికి నోచుకోలేదు. నిజానికి సినిమా వాళ్లు అంటే చాలు ఎవ్వరైనా పరుగెత్తుకు వెళ్తారు. మీడియా కూడా అదే తరహాగా వుంటుంది.
కానీ మోహన్ బాబు కుటుంబం అనేసరికి తెలియని ఓ భయాన్ని స్ప్రెడ్ చేసేసారు. ఎవరు ఫోన్ చేస్తారో భయం..ఎక్కడికి రమ్మంటారో అన్న భయం. దాంతో ఆ ఫ్యామిలీని టచ్ చేయడం అంటేనే 'మనకెందుకు వచ్చింది' అనే ఆలోచనా విధానం చాలా మంది మీడియా జనాలకు వచ్చేసింది. నటుడు ఆది చేసిన స్కిట్ విషయంలో చాలా గ్యాసిప్ లు వినిపించాయి. అవి ఎంత వరకు అవాస్తవం అన్నది క్లారిటీగా ఖండించలేపోయారు.
నిజానికి ఈ సత్యం గ్రహించి, కొంత మారే ప్రయత్నం మంచు కుటుంబ సభ్యులు చేసారు. కానీ అప్పటికీ జనం దగ్గర కాలేకపోయారు. మనసుల్లో ఇరుక్కుపోయిన భయమే తప్ప మరేమీ కాదు. ఎప్పుడయితే మీడియా లేదా ఫ్యాన్స్ ఇలా న్యూట్రల్ అయిపోయారో, ట్రోలర్స్ ను అడ్డుకునేవారే లేకపోయారు. ట్రోలింగ్ అంతా వన్ సైడ్ అయిపోయింది.
దానికి తోడు మంచు ఫ్యామిలీ మాట్లాడే మాటలు, ఇచ్చే స్టేట్ మెంట్లు చాలా వరకు లాజిక్ లకు దూరంగా, లాఫింగ్ స్ఠప్ గా మారిపోయాయి. నిజానికి నెగిటివ్, లేదా పాజిటివ్ పబ్లిసిటీ అన్నది సెలబ్రిటీలకు చాలా అవసరం. మీడియాతో సాన్నిహిత్యంగా వుంటూ రెండు వైపులా అభిమానం సంతరించుకోవడం అవసరం. మోహన్ బాబు తరంలో మీడియా వేరు. అప్పటి వ్యవహారాలు వేరు. ఇప్పటి తరహా వేరు.
ఈ జనరేషన్ కు తగినట్లు మారడంతో మంచు ఫ్యామిలీ విపలమైందనే చెప్పాలి. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా మీడియా ముందు ఆటిట్యూడ్ అస్సలు చూపించరు. మెగాస్టార్ దగ్గర నుంచి ఎన్టీఆర్ వరకు ఆఫ్ స్క్రీన్ మీద చాలా పద్దతిగా వుంటారు. నెగిటివ్ లు పొరపాటున రాసిన వారి ఏనాడూ ఫోన్ లు చేసి బెదిరించరు. మహా అయితే లోలోపల తిట్టుకుంటారు. తమ సర్కిల్ లో తిట్టుకుంటారు. జోకులు వేసుకుంటారు.
సినిమా ఫ్యాన్స్ ను, వారికి సోషల్ మీడియా ఇచ్చిన స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకుని వీలయినంత జాగ్రత్తగా వ్యవహరించడం సెలబ్రిటీలకు అవసరం. ఓ ఊరు రాజు మరో ఊరు తలారి అన్నట్లు, ఎంత గొప్పవారైనా సినిమా రంగంలోకి ఎంటర్ అయితే ఇక్కడ తీరే వేరుగా వుంటుంది.
సినిమా పరిశ్రమలో ఇంత మంది చిన్న, చితక హీరోలు సైతం బిజీగా వుంటున్నారు. కానీ మంచు ఫ్యామిలీ కి ఆ అవకాశం లేదు. ఎందుకంటే వారికి నటన రాదనో, మరోటనో కాదు, వారి దగ్గరకు వెళ్లడానికే భయం. ఇండస్ట్రీలో వివాదాలు, మీడియాతో వివాదాలు, జనాలతో వివాదాలు. ఇవన్నీ కలిసి మంచు ఫ్యామిలీని బలంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. తాము ఎక్కడో..తమ స్థాయి మరెక్కడో అన్న భావజాలం నుంచి కాస్త కిందకు దిగాలి. తాము మారాము అన్న భావన బలంగా కల్పించగలగాలి. కేవలం నటన తప్ప మరే విషయం పట్టించుకోకుండా నిర్మాత, దర్శకులకు సరెండర్ కావాలి. కచ్చితంగా బ్రేక్ రావడానికి అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి.
మోహన్ బాబుకు వయసు మీదపడి వుండొచ్చు. కానీ విష్ణుకు, మనోజ్ కు కాదు కదా? అందువల్ల ఇఫ్పటికైనా తన వ్యవహారాలను తాము సమూలంగా ప్రక్షాళన చేసుకోవడం, మంచి సబ్జెక్ట్ లు, మంచి సినిమాలు చేయడం అవసరం. ఎందుకంటే నాలుగు దశాబ్దాలకు పైబడిన కెరీర్ మోహన్ బాబుది. ఆ వారసత్వం పిల్లలు నిలబెట్టుకోగలగాలి.,