సీక్వెల్ క‌బుర్లు… విన‌డం వ‌ర‌కూ బాగున్నాయ్!

సినిమాలో స్ట‌ఫ్ లేక‌పోతే.. అదెంత పెద్ద సినిమాకు సీక్వెల్ అయినా, అదెంత‌టి సూప‌ర్ హిట్ కు కొన‌సాగింపు అయినా తిప్పి గొట్ట‌డానికి ప్రేక్ష‌కులు అయితే మొహ‌మాట‌ప‌డ‌టం లేదు!

రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనో, రెండున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధిలోనో, అదీ కాలేదంటే.. మూడు గంట‌లు, మ‌రికాస్త మించిన వ్య‌వ‌ధిలోనో ఒక సినిమా క‌థ‌ను చెప్పేస్తే అది అక్క‌డితో అయిపోతుంది. ప్రేక్ష‌కుడికి కూడా ఒక పూర్తి చిత్రాన్ని చూసిన అనుభూతి క‌లుగుతుంది. ఒక‌వేళ తాము చెప్పే క‌థ‌లో అంత‌కు మించిన డెప్త్ ఉందంటే.. సినీరూప‌క‌ర్త‌లు ఎంచ‌క్కా వెబ్ సీరిస్ ల‌ను తీసుకోవ‌చ్చు! వెబ్ సీరిస్ ల మార్కెట్ కూడా ఇప్పుడు భారీ స్థాయిలో ఉంది. వాటి కోసం ఓటీటీ ప్ర‌సార సంస్థ‌లు పోటీలు పడుతూ ఉన్నాయి. ప్రేక్ష‌కులు కూడా వెబ్ సీరిస్ ల‌కు క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తూ ఉన్నారు.

అయితే.. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా సీక్వెల్స్ మీద రూప‌క‌ర్త‌ల మోజు అంత‌కంత‌కూ పెరుగుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం! సింపుల్ గా చెప్పాలంటే సీక్వెల్ అనేది ఒక సేఫ్ జోన్. కొత్త‌గా క‌థ గురించి పాత్ర‌ల గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే షూటింగ్ ను ఆ సెట్స్ మీదే చేసేసుకోవ‌చ్చు. న‌టీన‌టుల డేట్స్ ను కూడా స‌ర్దేసుకోవ‌చ్చు! ఒక ప్ర‌చారం కూడా కొత్త‌గా మొద‌లుపెట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. పాత‌దానికి కొనసాగింపు అన్న‌ట్టుగ వ్య‌వహారం పూర్తి చేసుకోవ‌చ్చు. దీంతోనే సీక్వెల్ మార్గాల‌ను ప‌డుతున్న‌ట్టుగా ఉన్నారు హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు మూకుమ్మ‌డిగా! అయితే.. విజ‌యాల రేటు మాత్రం సీక్వెల్స్ విష‌యంలో త‌గ్గిపోతోంద‌ని చెప్ప‌డానికి కూడా మొహ‌మాట‌ప‌డ‌న‌క్క‌ర్లేదు!

బాహుబ‌లి 2, పుష్ప 2 వంటి వాటిని మిన‌హాయిస్తే.. ప్ర‌త్యేకించి సౌత్ లో వీటి విజ‌యాల రేటు త‌క్కువ‌గానే ఉంది. బాలీవుడ్ లో కూడా ఇదే ప‌రిస్థితి. అయితే.. బాలీవుడ్ లో ప‌ది ఇర‌వై యేళ్ల కింద‌ట హిట్ అయిన సినిమాల‌కు కూడా ఇప్పుడు రెండో సీక్వెల్, మూడో సీక్వెల్ అంటూ తీసుకుంటూ పోతూ ఉన్నారు. అక్క‌డ ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయం. క‌థ‌, పాత్ర‌లు ఇలా ఏదీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉండ‌వు. అయితే పేరుకు మాత్రం సీక్వ‌ల్ అని ప్ర‌క‌టించేసి అనౌన్స్ చేసుకోవ‌డం, వ్యాపారం చేసుకోవ‌డం జ‌రుగుతూ ఉంది, ఇలాంటి సీక్వెల్స్ స‌క్సెస్ రేటు అక్కడా త‌క్కువే! అయితే సినిమాల‌పై హైప్ క్రియేట్ చేసుకోవ‌డానికి మ‌రో మార్గ‌మే లేన‌ట్టుగా అక్క‌డ సీక్వెల్ అనౌన్స్ మెంట్లు వ‌స్తూ ఉన్నాయి. ఇక తెలుగులో పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాల‌కు, హిట్ అయిన ప్ర‌తి సినిమాకూ సీక్వెల్ ఇప్ప‌ట్లో త‌ప్పేలా లేదు!

పుష్ప 2 హిట్ త‌ర్వాత దాని మూడో పార్ట్ వ‌స్తుందా అనేది ఇంకా శేష‌ప్ర‌శ్న‌గానే ఉంది. బ‌హుశా ఉత్త‌రాదిన ఆ సినిమా హిట్ అయిన రీత్యా చూస్తే మూడో పార్ట్ త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తుంది! పుష్ప‌పై ఉత్త‌రాదిన ఇంకా ఉత్సాహం ఉన్న‌ట్టుగానే ఉంది కాబ‌ట్టి.. మూడో పార్ట్ వ‌చ్చినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. అయితే ప్ర‌స్తుతానికి అయితే అల్లు అర్జున్ వేరే సినిమాతో, సుకుమార్ మ‌రో సినిమాతో బిజీ కావొచ్చు.. దీంతో మూడో పార్ట్ కు కాస్త విరామం ఏర్ప‌డిన‌ట్టే. ఆ విరామం త‌ర్వాత కూడా పుష్ప మూడో భాగం ప‌ట్ల జ‌నాస‌క్తిని బ‌ట్టి.. అది రావ‌డం, రాక‌పోవ‌డం ఆధార‌ప‌డి ఉండ‌వ‌చ్చు. రెండో భాగంలో అర్ధాంత‌ర ముగింపును బ‌ట్టి చూస్తే మాత్రం మూడో భాగం ఉన్న‌ట్టే!

దేవ‌ర రెండో భాగం పెండింగ్ లో ఉన్న‌ట్టే. అయితే ఆ సినిమా ప‌ట్ల వ‌చ్చిన మిశ్ర‌మ స్పంద‌న‌, ప్ర‌త్యేకించి ప్యాన్ ఇండియా సినిమాగా విడుద‌లై ఆ మేర‌కు ఉత్త‌రాదిన ఊపు తెచ్చుకోక‌పోవ‌డం వ‌ల్ల రెండో భాగం వ‌స్తుందా రాదా అనేది ఇప్పుడు చెప్ప‌గ‌లిగే అంశంలా లేదు. ఎన్టీఆర్ దృష్టి కూడా ఇప్పుడు ఇత‌ర సినిమాల మీద ఉన్న‌ట్టుగా ఉంది. ఒకే ఊపులో వ‌ర‌స‌గా రెండు భాగాల‌పై హీరోల ప‌ని కొన‌సాగితే సీక్వెల్ కు ఢోకా లేదు. ఎటొచ్చీ విరామం వ‌స్తేనే ఇది ప్ర‌శ్నార్థ‌కం అవుతూ ఉంది.

ఉదాహ‌ర‌ణ‌కు బాహుబ‌లి పార్ట్ వ‌న్ విడుద‌ల త‌ర్వాత ఇత‌ర సినిమాల ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చినా ప్ర‌భాస్ బిజీ అయ్యింది మాత్రం పార్ట్ టూ షూటింగ్ తోనే. ఆ సినిమా హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాణ సంస్థ‌.. ఇలా అంద‌రి కాన్స‌న్ ట్రేష‌న్ సీక్వెల్ పార్ట్ మీదే క‌నిపించిద‌ప్పుడు. దీంతో సీక్వెల్ రానే వ‌చ్చింది. అలాగే పుష్ప విష‌యంలో కూడా అదే జ‌రిగింది. సీక్వెల్ పార్ట్ కు చాలా స‌మ‌యం తీసుకున్నా.. మ‌ధ్య‌లో హీరో, ద‌ర్శ‌కుడు మ‌రో ప్రాజెక్టును రానివ్వ‌లేదు. దీంతో సీక్వెల్ రానే వ‌చ్చింది.

ఇక సీక్వెల్ త‌ప్ప‌నిస‌రిగా రావాలంటే ఉన్న మ‌రో అవ‌కాశం వీలైనంత షూటింగ్ ను ఫ‌స్ట్ పార్ట్ స‌మ‌యంలోనే పూర్తి చేయ‌డం. క‌థ‌ను ఒక పార్ట్ లో స‌గం వ‌ర‌కూ చూపి రెండో భాగం లో మిగ‌తా క‌థ చూపించాల‌నుకున్న‌ప్పుడు ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ లో నే రెండో పార్ట్ కు కూడా షూటింగ్ ను కొంత భాగ‌మైన పూర్తి చేసి ఉన్నా సీక్వెల్ కు ఇబ్బంది లేక‌పోవ‌చ్చు! కొద్దో గొప్పో షూటింగ్ మిగిలి ఉంటే ఆ త‌ర్వాతి కాలంలో పూర్తి చేసి రెండో పార్ట్ ను విడుద‌ల చేసుకోవ‌చ్చు. కానీ ద‌ర్శ‌కుల‌కు ఒక పార్ట్ ను స‌రిగ్గా క‌ట్ చేసి వ‌ద‌ల‌డ‌మే క‌త్తి మీద సాముగా మారిన నేప‌థ్యంలో సీక్వెల్ కు సంబంధించిన సీన్ల‌ను ముందుగానే షూట్ చేసుకునేంత వీలు ఉండ‌క‌పోవ‌చ్చు. అంత ప్లానింగ్, బ‌డ్జెట్ లు కూడా తేలిక కాదు!

ఇప్పుడు ఇంకా అనేక సినిమాలు స‌గంలో ఆగి ఉన్నాయి. ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. స‌లార్ ఒక పార్ట్ విడుద‌లై ఉంది. క‌థ చెప్ప‌డాన్ని స‌గంలో ఆపారో, స‌గంలో స‌గంలో ఆపారో ప్రేక్ష‌కుడికి అంతుబ‌ట్ట‌దు. ఇప్ప‌టికే ఏడాది గ‌డిచిపోయింది. ఇప్పుడ ప్ర‌భాస్ షెడ్యూల్ ను చూసినా, ఆ సినిమా ద‌ర్శ‌కుడి షెడ్యూల్ ను చూసినా.. రెండో పార్ట్ ఎప్ప‌టికి వ‌చ్చేది కూడా ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. సీక్వెల్ పార్ట్ కు సంబంధించి ఎంత షూటింగ్ పూర్త‌య్యింద‌నే దాన్ని బ‌ట్టి అది వ‌స్తుందా రాదా అనే అంచ‌నాలుకు రావొచ్చు. స‌లార్ క‌థ‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ విప్పిన గుప్పిట‌ను గ‌మ‌నిస్తే.. దాని క‌థ రెండో భాగంతో కూడా పూర్తి కాదు. మూడో భాగం కూడా అవ‌స‌రం కావొచ్చు. మ‌రి ప్ర‌భాస్ సినిమాలు విడుద‌ల‌వుతున్న వేగాన్ని బ‌ట్టి చూస్తే.. ఇంకో రెండు భాగాలుగా విడుద‌ల కావాలంటే క‌నీస ప‌దేళ్ల స‌మ‌యం ప‌ట్టినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు!

ఈ హీరో మ‌రో సినిమా క‌ల్కి ప‌రిస్థితి కూడా అంతే. అస‌లేం క‌థ చెప్ప‌ద‌లుచుకున్నారో ఫ‌స్ట్ పార్ట్ తో వ‌చ్చిన క్లారిటీ కొంతే! ఆ సినిమాను ఐదారు భాగాలుగా విడుద‌ల చేసుకునేంత స్టఫ్ ఉందంటూ మొద‌ట్లోనే ప్ర‌క‌టించారు. తొలి భాగంతో భారీ వ‌సూళ్లు అన్నారు. దీంతో రెండో భాగం రానే వ‌చ్చు. అయితే ప్ర‌భాస్ కు సంబంధించి స‌లార్ సీక్వెల్ ముందు వ‌స్తుందా, లేక క‌ల్కి సీక్వెల్ ముందు వ‌స్తుందో .. లైన్లో ఉన్న ఇత‌ర సినిమాలు వ‌స్తాయో, మ‌ళ్లీ వాటి సీక్వెల్స్ ప‌రిస్థితి ఏమిటో క్లారిటీ లేన‌ట్టే.

ఈ మ‌ధ్య‌నే భార‌తీయుడు సినిమాకు సీక్వెల్ గా భార‌తీయుడు 2 వ‌చ్చి డిజాస్ట‌ర్ గా నిలిచింది. అదే స‌మ‌యంలోనే ద‌ర్శ‌కుడు శంక‌ర్ మూడో పార్ట్ షూటింగ్ ను పూర్తి చేశార‌ట‌. షూటింగ్ దాదాపు పూర్తైనా అత‌డి ఇటీవ‌లి సినిమాల ఫ‌లితాల‌ను బ‌ట్టి.. మూడో పార్ట్ ఊసును ఎవ్వ‌రూ ఎత్త‌డం లేదు. దాన్ని వీలైతే ఓటీటీలో విడుద‌ల చేసేసి చేతులుదులుపుకునే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయ‌ట‌! అయితే దాన్ని థియేట‌రిక‌ల్ రిలీజ్ ఉంటుంద‌నే అంచ‌నా. కానీ ఎప్పుడో స్ప‌ష్ట‌త లేదు.

ఇంకా బోలెడ‌న్ని సినిమాల‌కు సీక్వెల్స్ లైన్లో ఉన్నాయి. జైల‌ర్ 2 రాబోతోంద‌ట‌, జైల‌ర్ ఓ మోస్తరు విజ‌యాన్నే న‌మోదు చేసుకుంది. అయినా దాని సీక్వెల్ పై మోజు తీర‌న‌ట్టుగా ఉంది. ర‌జ‌నీ సినిమాలు మునుప‌టిలా ఉత్సాహాన్ని రేకెత్తించ‌ని నేప‌థ్యంలో.. కాస్త హిట్ అయినా సినిమాను వీలైనంత‌గా క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నం కాబోలు అది.

అలాగే జ‌నాలకు ఒక ద‌శ‌లో ఆక‌ట్టుకున్న అనేక సినిమాల‌కు సీక్వెల్స్ అంటున్నారు. హీరో కోస‌మో, ద‌ర్శ‌కుడి కోసమో అలాంటి సీక్వెల్ ఊసుల వ‌స్తున్నాయి. వాటిల్లో క‌థ అక్క‌డితో ముగిసిపోయినా చెట్టుపేరు చెప్పి క‌థ‌ల‌మ్మ‌కునే ప్ర‌య‌త్నంలో భాగంగా కూడా కొన్ని సీక్వెల్స్ ఊసులు వినిపిస్తున్న‌ట్టుగా ఉన్నాయి. అయితే సినిమాలో స్ట‌ఫ్ లేక‌పోతే.. అదెంత పెద్ద సినిమాకు సీక్వెల్ అయినా, అదెంత‌టి సూప‌ర్ హిట్ కు కొన‌సాగింపు అయినా తిప్పి గొట్ట‌డానికి ప్రేక్ష‌కులు అయితే మొహ‌మాట‌ప‌డ‌టం లేదు! ఎంత సీక్వెల్ అయినా స్క్రిప్ట్ లో స‌త్తా ఉండాల్సిందే!

2 Replies to “సీక్వెల్ క‌బుర్లు… విన‌డం వ‌ర‌కూ బాగున్నాయ్!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.