సిగ్గుసిగ్గు…30 నెల‌లుగా జీతాలు లేవు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డాక్ట‌ర్ అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యానికి సంబంధించి పార్ట్ టైమ్ ఉద్యోగులు 30 నెల‌లుగా జీతాల‌కు నోచుకోవ‌డం లేదు. ఏపీ ప్ర‌భుత్వం సిగ్గుప‌డాల్సిన విష‌యం ఇది. ప్ర‌తినెలా ఒక‌టో తారీఖుల జీతాలు వేయ‌క‌పోవ‌డంతో  ఇబ్బందులు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డాక్ట‌ర్ అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యానికి సంబంధించి పార్ట్ టైమ్ ఉద్యోగులు 30 నెల‌లుగా జీతాల‌కు నోచుకోవ‌డం లేదు. ఏపీ ప్ర‌భుత్వం సిగ్గుప‌డాల్సిన విష‌యం ఇది. ప్ర‌తినెలా ఒక‌టో తారీఖుల జీతాలు వేయ‌క‌పోవ‌డంతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ప్ర‌భుత్వ ఉద్యోగులు వాపోతున్న సంగ‌తి తెలిసిందే. అలాంటిది ఏకంగా రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా అస‌లు వేత‌నానికే నోచుకోక‌పోతే, వాళ్లు ఎలా బ‌తుకుతార‌ని, పిల్ల‌ల చ‌దువులు, ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌ను ఎలా తీర్చుకుంటార‌నే క‌నీస స్పృహ కూడా ప్ర‌భుత్వానికి లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డాక్ట‌ర్ అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యానికి సంబంధించి 76 అధ్య‌య‌న కేంద్రాలున్నాయి. కోఆర్డినేట‌ర్ల‌తో క‌లిసి మొత్తం 400 మంది పార్ట్‌టైమ్ ఉద్యోగులు, 26 మంది రెగ్యుల‌ర్ ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. క‌ళాశాల‌కు వెళ్లి చ‌దువుకోడానికి వీలు కాని వారికి ఉన్న‌త విద్య అందించే ల‌క్ష్యంతో సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం ప‌ని చేస్తోంది. స‌మాజంలో బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాలు, ర‌క‌ర‌కాల ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్న‌వారు, గృహిణుల‌కు ఉన్న‌త విద్య అందించే ల‌క్ష్యంతో దేశంలోనే మొట్ట‌మొద‌టి సారి 1982లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటు ఏర్పాటైంది. అనంత‌ర కాలంలో ఆ సంస్థ‌ను డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విశ్వ‌విద్యాల‌యంగా మార్చారు. ఈ విశ్వ‌విద్యాల‌యం నుంచి ఎంద‌రో ఉన్న‌త విద్య అభ్య‌సించారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం తెలంగాణ‌లోనే ఉండిపోయింది. హైద‌రాబాద్ నుంచే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విద్యార్థుల‌కు సేవ‌లందిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అధ్య‌య‌న కేంద్రాల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ‌మే చెల్లించాల‌ని 2015లో హైకోర్టు స్ప‌ష్టం చేసింది. స‌మ‌స్య‌ల్లా పార్ట్‌టైమ్ ఉద్యోగుల జీతాలే. సీఎఫ్ఎంఎస్ పోర్ట‌ల్‌లో బిల్లులు అప్‌లోడ్ చేయాల‌నే నిబంధ‌న విధించాక చెల్లింపుల్లో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి.

ఓపెన్ యూనివ‌ర్సిటీ స్ట‌డీ సెంట‌ర్ల‌లో ప‌నిచేసే సిబ్బంది వేతనాలు చాలా త‌క్కువ‌. వెట్టి చాకిరి చేయించుకుంటూ వారికి వేత‌నాలు ఇవ్వ‌క‌పోవ‌డం తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. అధ్య‌య‌న కేంద్రాల్లో ప‌ని చేసే క్ల‌ర్క్కు రూ.6,500, అటెండ‌ర్‌కు రూ.4,500, వాచ్‌మ‌న్‌కు  రూ.1200, స్వీప‌ర్‌కు రూ.1200, స్కావెంజ‌ర్‌కు రూ.1200 చొప్పున ఇస్తారు. ఇంత త‌క్కువ జీతాలు ప్ర‌తినెలా ఇవ్వ‌డానికి కూడా ప్ర‌భుత్వానికి మ‌న‌సు రావ‌డం లేదు.

ఇదిలా వుండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అధ్య‌య‌న కేంద్రాల సిబ్బంది జీతాల గురించి స‌మ‌న్వ‌యం చేసేందుకు ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీగా ప్ర‌భుత్వం డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిప‌ల్ వెల‌గ జోషిని నియ‌మించింది. ఈయ‌నకు మాత్రం నెల‌కు రూ.2.50 ల‌క్ష‌లు ఇస్తున్నారు. ఇదేదో ఉద్యోగుల‌కే ఇస్తే స‌రిపోయేది క‌దా అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నెల‌కు ల‌క్ష‌లాది రూపాయ‌లు జీతం తీసుకుంటూ… 30 నెల‌లుగా జీతాలు రాని పార్ట్‌టైమ్ ఉద్యోగుల గురించి ఏమి ఆలోచిస్తున్నారో ఆయ‌న‌కే తెలియాలి. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ద‌య‌చూపి వారికి జీతాలు ఇవ్వాల్సిన అవ‌సరం ఉంది.