టెక్కలిలో దువ్వాడ దూకుడు

శ్రీకాకుళానికి ఏప్రిల్‌ నెలలో వచ్చిన జగన్‌ మూలపేట సీ పోర్టు శంకుస్ధాపన తరువాత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మీద పోటీ చేసేది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అని స్పష్టం చేశారు.…

శ్రీకాకుళానికి ఏప్రిల్‌ నెలలో వచ్చిన జగన్‌ మూలపేట సీ పోర్టు శంకుస్ధాపన తరువాత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మీద పోటీ చేసేది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అని స్పష్టం చేశారు. అంతే కాదు టెక్కలి వైసీపీలో ఉన్న సీనియర్‌ నాయకులు అంతా కలసికట్టుగా ఉండి గెలిపించాలని సూచించారు. 

జగన్‌ చెప్పినదే తడవు అన్నట్లుగా దువ్వాడ జనంలోకి వచ్చేశారు. ఈసారి అచ్చెన్నను ఎలాగైనా ఓడిరచాలన్న పంతం ఆయనలో ఉంది. జనాలలో దువ్వాడకు సానుభూతి కూడా బాగానే ఉంది. 

గత రెండు దశాబ్దాలుగా పార్టీలకు అతీతంగా ఆయన వ్యక్తిగతంగా కింజరాపు కుటుంబం మీద అలుపెరగని పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే దువ్వాడలో ఉన్నది కష్టించే తత్వం, కసిగా పోరాడే నైజం అయితే మైనస్‌ పాయింట్‌ సొంత పార్టీలో సైతం ఎవరినీ కలుపుకుని పోలేని వైఖరి. 

టెక్కలిలో 2019 ఎన్నికలలో పోటీ చేసి అచ్చెన్న మెజారిటీని ఎనిమిదివేలకు తీసుకువచ్చిన కాళింగ కార్పోరేషన్‌ చైర్మన్‌ పేడాడ తిలక్‌ ఉన్నారు. ఆయనను దువ్వాడ దగ్గరకు తీయడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి. అలాగే కేంద్ర మంత్రిగా పనిచేయడమే కాదు,కింజరాపు ఎర్రంన్నాయుడును ఓడిరచిన ఘనత సాధించిన కిల్లి కృపారాణిని కూడా ఆయన తన వైపునకు తిప్పుకోలేకపోతున్నారు. 

టెక్కలిలో కాళింగ సామాజికవర్గం అధికం. రెండు సార్లు గెలిచిన అచ్చెన్న పట్ల వ్యతిరేకత ఉంది. దువ్వాడ పట్ల అనుకూలత ఉంది. అయితే ఈ  ఇద్దరు కీలక నేతలను కలుపుకుని ఆయన ముందుకు పోతే మాత్రం తెలుగుదేశం తరఫున మొదట ఓడేది అచ్చెన్న అని అంతా అంటున్నారు.