ప‌వ‌న్‌ను ఇరికించిన నాగ‌బాబు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో ఆయ‌న సోద‌రుడు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు ధైర్యం నింపుతున్నారు. నాగ‌బాబు ఇస్తున్న భ‌రోసా ఏ రేంజ్‌లో వుందంటే… ప‌వ‌న్ ఒంట‌రిగా బ‌రిలో దిగేంతగా అంటే ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. గ‌త సార్వ‌త్రిక…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో ఆయ‌న సోద‌రుడు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు ధైర్యం నింపుతున్నారు. నాగ‌బాబు ఇస్తున్న భ‌రోసా ఏ రేంజ్‌లో వుందంటే… ప‌వ‌న్ ఒంట‌రిగా బ‌రిలో దిగేంతగా అంటే ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 7శాతం ఉన్న జ‌న‌సేన బ‌లం… ప్ర‌స్తుతం ఏకంగా 35 శాతానికి పెరిగిన‌ట్టు నాగ‌బాబు చెప్ప‌డం ప‌వ‌న్‌లో ఎక్క‌డ లేని బ‌లాన్ని పెంచుతోంది. హ‌నుమంతుడి బ‌లం ఆయ‌న‌కే తెలియ‌న‌ట్టుగా, ప‌వ‌న్‌క‌ల్యాణ్ శ‌క్తిసామ‌ర్థ్యాలు బ‌హుశా ఆయ‌న‌కే తెలిసిన‌ట్టుగా లేవు.

కార్య‌క‌ర్త‌లు భ‌రోసా ఇస్తే ఒంట‌రిగా బ‌రిలో దిగ‌డానికి త‌న‌కెలాంటి ఇబ్బంది లేద‌ని పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కార్య‌క‌ర్త‌లు భ‌రోసా ఇవ్వ‌క‌పోతే, జ‌గ‌న్‌తో ముఖాముఖి ఢీకొని వీర‌మ‌ర‌ణం పొంద‌లేనని ఆయ‌న నిర్మొహ‌మాటంగా తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ నేతృత్వం వ‌హిస్తున్న జ‌న‌సేన బ‌లం ఏంటో నాగ‌బాబు తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి అయితే అని మాట్లాడుతూ టీడీపీ నేత‌ల‌ను ఇరిటేట్ చేస్తున్నార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అన‌కాప‌ల్లి జిల్లా రాంబిల్లి మండ‌లం హ‌రిపురంలో ఎల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన కార్యాల‌యాన్ని నాగ‌బాబు ప్రారంభించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో నాగ‌బాబు ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీ అధికారంలోకి రావాల‌ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇంటికి పోవాల‌ని ఆకాంక్షించ‌డం గ‌మ‌నార్హం. రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పార్టీ  పొత్తుల‌పై చ‌ర్చ‌లు వ‌ద్ద‌న్నారు.

జ‌న‌సేన త‌ర‌పున ఎవ‌రు పోటీ చేస్తే వారిని గెలిపించ‌డ‌మే ధ్యేయంగా ప‌ని చేయాల‌ని శ్రేణుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో 7 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 35కు పెరిగింద‌ని అంచ‌నాలు చెబుతున్నాయ‌ని నాగ‌బాబు చెప్ప‌డం విశేషం. జ‌న‌సేన బ‌లం 35 శాతానికి పెరగ‌డం అంటే టీడీపీ ఓటు బ్యాంక్‌కు చిల్లు ప‌డ్డ‌ట్టే. మ‌రి టీడీపీపై ఆధార‌ప‌డాల్సిన దుస్థితి జ‌న‌సేన‌కు ఎందుకు? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. జ‌న‌సేన బ‌లం పెరిగింద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఇక ఆ పార్టీ ప‌క్క చూపులు చూడాల్సిన అవ‌స‌రం ఏంటి? అనే నిల‌దీత ఎదుర‌వుతోంది.

ప‌వ‌న్‌ను రాజ‌కీయంగా ఇరికించేలా నాగ‌బాబు మాట‌లున్నాయ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. జ‌న‌సేన ఓటు బ్యాంక్ ఏకంగా 35 శాతానికి పెరిగిన‌ప్పుడు ఒంట‌రిగా ఎందుకు పోటీ చేయాల‌ని అనుకోవ‌డం లేదు? అలాగే సీఎం ప‌ద‌విలో చంద్ర‌బాబును కూచోపెట్టాల‌ని ప‌వ‌న్ ఎందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌నే ప్ర‌శ్న‌ల‌కు నాగ‌బాబు మాట‌లు కార‌ణం అవుతున్నాయి. నాగ‌బాబు ప‌దేప‌దే ప‌వ‌న్ సీఎం అని అన‌డానికి వెనుక ఏదైనా వ్యూహం వుందా? అనే చ‌ర్చ కూడా లేక‌పోలేదు.