రాజుగారికేనా…రెడ్డిగారికి షోకాజ్ నోటీస్ ఇవ్వ‌రా?

పొత్తుల‌పై స్థాయిని మ‌రిచి మాట్లాడార‌ని, అలాగే ఏపీలో బీజేపీని చుల‌క‌న చేసేలా ప్ర‌ధాని మోదీతో తానేదో అన్న‌ట్టు విష్ణుకుమార్ రాజు మాట్లాడ్డంపై ఆ పార్టీ ఆగ్ర‌హంగా ఉంది. దీంతో విష్ణుకుమార్ రాజుకు బీజేపీ రాష్ట్ర…

పొత్తుల‌పై స్థాయిని మ‌రిచి మాట్లాడార‌ని, అలాగే ఏపీలో బీజేపీని చుల‌క‌న చేసేలా ప్ర‌ధాని మోదీతో తానేదో అన్న‌ట్టు విష్ణుకుమార్ రాజు మాట్లాడ్డంపై ఆ పార్టీ ఆగ్ర‌హంగా ఉంది. దీంతో విష్ణుకుమార్ రాజుకు బీజేపీ రాష్ట్ర క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ అనుకూల ధోర‌ణితో మాట్లాడ్డం కొత్తేం కాదు.

టీడీపీలో చేరాల‌ని ఆయ‌న చాలా కాలం క్రిత‌మే నిర్ణ‌యించుకున్నారు. బీజేపీలో వుంటే రాజ‌కీయ భ‌విష్య‌త్ లేద‌నే అభిప్రాయానికి ఆయ‌న వ‌చ్చారు. ఒక‌వేళ టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు కుదుర్చుకుంటే మ‌ళ్లీ 2014లో మాదిరిగా ఎమ్మెల్యే కావ‌చ్చనే క‌ల‌లు క‌న్నారు. అవి క‌ల్ల‌ల‌య్యే ప‌రిస్థితి వుండ‌డంతో టీడీపీలో భ‌విష్య‌త్‌ను వెతుక్కుంటున్నారు. అయితే విష్ణుకుమార్ రాజుకు ప్ర‌జ‌ల్లో చెప్పుకో త‌గిన పేరు లేదు.

ఈ నేప‌థ్యంలో పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించి మాట్లాడార‌నే కార‌ణంతో విష్ణుకుమార్ రాజుకు షోకాజ్ నోటీసు ఇవ్వ‌డం అనేక ర‌కాల చ‌ర్చ‌కు దారి తీసింది.  ఇటీవ‌ల పొత్తుల‌పై మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత ఆదినారాయ‌ణ‌రెడ్డి కూడా పార్టీ విధానాల‌కు విరుద్ధంగా మాట్లాడ్డారు. మూడు పార్టీల పొత్తు కోస‌మే ఇటీవ‌ల చంద్ర‌బాబుతో ప‌వ‌న్ చ‌ర్చించార‌ని కూడా ఆయ‌న అన్నారు. మ‌రి ఆదినారాయ‌ణ‌రెడ్డికి క్ర‌మ‌శిక్ష‌ణ వ‌ర్తించ‌దా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

టీడీపీ అనుకూల బీజేపీ నేత‌లంతా ఒక ప‌థ‌కం ప్ర‌కారం పొత్తుల‌పై మాట్లాడుతుంటే, కేవ‌లం విష్ణుకుమార్ రాజుకు మాత్ర‌మే షోకాజ్ నోటీసు ఇవ్వ‌డం ఏంట‌నే నిల‌దీత ఎదుర‌వుతోంది. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన నాయ‌కులు ఏ స్థాయి వారైనా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే అని, ఆదినారాయ‌ణ‌రెడ్డి విష‌యంలో మాత్రం ఆ ప‌ని ఎందుకు జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌శ్న వ‌స్తోంది. రాజుగారికేనా షోకాజ్ నోటీస్‌, రెడ్డిగారికి లేదా? అని ప్ర‌శ్నించే వాళ్ల‌కు బీజేపీ ఏం స‌మాధానం చెబుతుంది?