జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌శంస‌నీయ చ‌ర్య‌

విద్యార్థుల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌శంస‌నీయ చ‌ర్య చేప‌ట్టింది. మ‌ణిపూర్‌లో అల్ల‌ర్ల కార‌ణంగా తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కున్నాయి. ఆ రాష్ట్రంలో ప్ర‌జ‌లు బ‌తుకుజీవుడా అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ణిపూర్‌లో…

విద్యార్థుల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌శంస‌నీయ చ‌ర్య చేప‌ట్టింది. మ‌ణిపూర్‌లో అల్ల‌ర్ల కార‌ణంగా తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కున్నాయి. ఆ రాష్ట్రంలో ప్ర‌జ‌లు బ‌తుకుజీవుడా అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ణిపూర్‌లో చ‌దువుకుంటున్న ఆంధ్రా విద్యార్థుల ప‌రిస్థితిపై వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఎలాగైనా త‌మను సుర‌క్షితంగా ఆంధ్రాకు తీసుకెళ్లాల‌ని మ‌ణిపూర్‌లో చ‌దువుకుంటున్న ప‌లువురు విద్యార్థులు సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ స‌ర్కార్‌కు విన్న‌వించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. విద్యార్థుల‌ను సుర‌క్షితంగా తీసుకొచ్చి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంది. మ‌ణిపూర్ నుంచి విమానంలో తీసుకొచ్చేందుకు కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ‌తో రాష్ట్ర అధికారులు చ‌ర్చ‌లు జ‌రిపారు. విద్యార్థుల కోసం ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసేందుకు ఏపీ అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఏపీ ప్ర‌భుత్వ విన్న‌పం మేర‌కు ప్రత్యేక విమానం ఏర్పాటుకు సివిల్‌ ఏవియేషన్‌ శాఖ అంగీకరించింది.విద్యార్థుల‌ను ఆంధ్రాకు త‌ర‌లించేందుకు  ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేయ‌నున్నారో చెప్పే ప‌నిలో సంబంధిత అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. 

దాదాపు 100 నుంచి 150 మంది విద్యార్థుల‌ను సుర‌క్షితంగా స్వ‌స్థ‌లాల‌కు పంపేందుకు ఏపీ స‌ర్కార్ అన్ని ర‌కాల చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంపై త‌ల్లిదండ్రులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇవాళ రాత్రికి మ‌ణిపూర్ నుంచి ఆంధ్రాకు విద్యార్థుల‌ను తీసుకొచ్చే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు.