రాజమౌళి నేర్చుకోవాల్సిన ‘పొన్నియన్’ పాఠం

హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు.. ఇలా అందరికీ కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులుంటాయి. అంతెందుకు, ఆ మాటకొస్తే టెక్నీషియన్స్ కు కూడా కొన్ని కలలుంటాయి. తమ డ్రీమ్స్ ను నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ…

హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు.. ఇలా అందరికీ కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులుంటాయి. అంతెందుకు, ఆ మాటకొస్తే టెక్నీషియన్స్ కు కూడా కొన్ని కలలుంటాయి. తమ డ్రీమ్స్ ను నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ క్రమంలో సక్సెస్ కొట్టడం అనేది కూడా చాలా ముఖ్యం. లేదంటే అది పొన్నియన్ సెల్వన్ లా తయారవుతుంది.

పొన్నియన్ సెల్వన్ అనేది మణిరత్నం డ్రీమ్. ఎప్పటికైనా ఆ పుస్తకాన్ని సినిమాగా తీస్తానని గతంలో ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు ఈ దిగ్గజ దర్శకుడు. చెప్పినట్టుగానే చేసి చూపించాడు. రెండు భాగాలుగా పొన్నియన్ సెల్వన్ ను తెరకెక్కించాడు. అయితే పాన్ ఇండియా లెవెల్లో తను అనుకున్న సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయాడు. పూర్తిగా ఓ తమిళ సినిమాగా ముద్ర వేయించుకుంది పీఎస్.

ఇలాంటిదే ఓ డ్రీమ్ రాజమౌళికి కూడా ఉంది. ఎప్పటికైనా మహాభారతం ఇతిహాసానికి వెండితెర రూపం ఇవ్వాలనేది జక్కన్న కల. ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఆయన బయటపెట్టారు కూడా. సరిగ్గా ఇక్కడే పొన్నియన్ సెల్వన్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెబుతున్నారు కొంతమంది.

మహాభారతాన్ని తెరకెక్కించడం రాజమౌళి లాంటి దర్శకులకు పెద్ద సమస్య కాదు. బోలెడంత డబ్బు పెట్టేవాళ్లున్నారు, కావాల్సినంత టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. అయితే అది పీఎస్ ప్రాజెక్టులా ఒక రాష్ట్రానికి లేదా ఓ వర్గానికి పరిమితమైపోకూడదంటున్నారు కొంతమంది. యూనివర్సల్ అప్పీల్ వచ్చేలా సన్నివేశాలు, స్క్రీన్ ప్లే మార్చాలని.. అలా అని ఇతిహాసానికి ఇష్టమొచ్చినట్టు మార్పులు చేస్తే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

ఈ సందర్భంగా విడుదలకు సిద్ధమైన ఆదిపురుష్ సినిమాను రిఫరెన్స్ గా చూపిస్తున్నారు. ఇది కూడా ఇతిహాసమే. రామాయణంలో ఓ భాగాన్ని ఆదిపురుష్ గా తీశారు. వచ్చే నెల విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ  ఈ సినిమాపై బజ్ రావడం లేదు. దీనికి కారణం మేకర్స్ ఎంచుకున్న కథావస్తువు. ఈ కాలం ఇలాంటి కథలకు ఈతరం ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కాస్త కష్టం అనేది చాలామంది మాట. పైగా టీజర్ రిలీజ్ టైమ్ లోనే ఈ సినిమాపై చాలా వివాదాలు తెరపైకొచ్చాయి.

ఈ వాదనల్ని ఖండించే బ్యాచ్ కూడా ఉన్నారు. ఓ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకునేముందు అందరికీ కనెక్ట్ అవుతుందా లేదా అనే అంశాన్ని రాజమౌళి ప్రధానంగా చూసుకుంటాడని చెబుతున్నారు. పైగా పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకానికి, మహాభారతం ఇతిహాసానికి చాలా తేడా ఉందంటున్నారు. మహాభారతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది కాబట్టి, రాజమౌళి నిరభ్యంతరంగా ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకురావొచ్చని, వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెబుతున్నారు.

ఏదేమైనా చారిత్రక నేపథ్యం, ఇతిహాసాల ఆధారంగా సినిమాలు తీసేటప్పుడు ఇప్పటితరం మనోభావాలు, అంచనాల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని పొన్నియన్ సెల్వన్ నిరూపించింది.