ఉత్తర ప్రదేశ్ జైలులో 95 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి పరీక్షల్లో ఫలానా జిల్లాలో ఉత్తీర్ణత శాతం భారీగా ఉందని, ఫలానా స్కూల్ టాప్ లో నిలిచిందని చెప్పుకోవడం సహజం. కానీ ఉత్తర ప్రదేశ్ లోని  జైళ్లు కూడా టాప్ లో నిలిచాయి.…

పదో తరగతి పరీక్షల్లో ఫలానా జిల్లాలో ఉత్తీర్ణత శాతం భారీగా ఉందని, ఫలానా స్కూల్ టాప్ లో నిలిచిందని చెప్పుకోవడం సహజం. కానీ ఉత్తర ప్రదేశ్ లోని  జైళ్లు కూడా టాప్ లో నిలిచాయి. పదో తరగతి పరీక్షల్లో 95శాతం ఉత్తీర్ణత సాధించాయి యూపీ జైళ్లు.

ప్రయాగ్‌రాజ్ లోని ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్, 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను ప్రకటించింది. జైళ్ల శాఖ ప్రకారం, 10వ తరగతి పరీక్షకు హాజరైన 60 మంది ఖైదీలలో 57 మంది ఉత్తీర్ణత సాధించారు. వీళ్లలో 82.40 శాతం మందికి ఫస్ట్ క్లాస్ మార్కులొచ్చాయి.

12వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైన 64 మంది ఖైదీల్లో 45 మంది పాస్ అయ్యారు. అంటే ఉత్తీర్ణత శాతం 70.30. వీళ్లలో ఆరుగురు ఖైదీలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.

10వ తరగతి బోర్డు పరీక్షలో ఫిరోజాబాద్ జిల్లా జైలులోని మొత్తం ఆరుగురు ఖైదీలు ఫస్ట్ డివిజన్ సాధించారు. అదేవిధంగా, లక్నోలోని జిల్లా జైలులో ఉన్న ఐదుగురు ఖైదీలకు ఫస్ట్ డివిజన్ మార్కులొచ్చాయి.

కొన్నేళ్లుగా యూపీ జైళ్లలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయని చెబుతోంది జైళ్ల శాఖ. మైనర్ ఖైదీలకు పుస్తకాలు, లైబ్రరీలను అందుబాటులో ఉంచడంతో పాటు.. పరీక్షల సమయంలో వాళ్లకు శారీరక శ్రమ తక్కువగా ఉండే పనులు అప్పజెబుతున్నారు. ఈ సంస్కరణల వల్ల మైనర్ ఖైదీల్లో మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు.