ల‌యోల‌లో హిజాబ్ క‌ల‌క‌లం!

ప్ర‌తిష్టాత్మ‌క విజ‌య‌వాడ ఆంధ్ర ల‌యోల క‌ళాశాల ప్రిన్సిపాల్ పైత్యం వ‌ల్ల కాసేపు క‌ల‌క‌లం రేగింది. క‌ర్నాట‌క‌లో హిజాబ్ వ్య‌వ‌హారం మ‌త‌విద్వేషాల‌కు దారి తీస్తుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో, అలాంటి ప‌రిణామాల‌కు విజ‌య‌వాడ ల‌యోల కాలేజీని…

ప్ర‌తిష్టాత్మ‌క విజ‌య‌వాడ ఆంధ్ర ల‌యోల క‌ళాశాల ప్రిన్సిపాల్ పైత్యం వ‌ల్ల కాసేపు క‌ల‌క‌లం రేగింది. క‌ర్నాట‌క‌లో హిజాబ్ వ్య‌వ‌హారం మ‌త‌విద్వేషాల‌కు దారి తీస్తుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో, అలాంటి ప‌రిణామాల‌కు విజ‌య‌వాడ ల‌యోల కాలేజీని వేదిక చేయాల‌నుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. విజ‌య‌వాడ ఆంధ్ర ల‌యోల కాలేజీకి ఎంతో పేరుంది. ఎన్నో ఏళ్ల క్రితం స్థాపించిన ఈ కాలేజీలో చ‌దువు కోవ‌డం అప్ప‌ట్లో ప్ర‌తి విద్యార్థి క‌ల‌.

అస‌లు విద్యా సంస్థలు చాలా త‌క్కువ‌గా ఉన్న కాలంలో నెల‌కొల్పిన కాలేజీ కావ‌డంతో ఎక్కడెక్క‌డి నుంచో ఇక్క‌డికి విద్య న‌భ్య‌సించేందుకు వ‌చ్చేవాళ్లు. పేరుకు క్రిస్టియ‌న్ కాలేజీ అయిన‌ప్ప‌టికీ, కుల‌మ‌తాల‌కు అతీతంగా అక్క‌డ ఇప్ప‌టికీ చ‌దువుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర ల‌యోల కాలేజీలో హిజాబ్ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. డిగ్రీ క‌ళాశాల ప్రిన్సిపాల్ అత్యుత్సాహమే వివాదానికి కార‌ణ‌మైంది. హిజాబ్‌తో కాలేజీకి వ‌చ్చిన ముస్లిం విద్యార్థినుల‌ను త‌ర‌గ‌తి గ‌దుల్లోకి అనుమ‌తించ‌లేదు. దీన్ని విద్యార్థినులు వ్య‌తిరేకించారు. తాము ఫ‌స్ట్ ఇయ‌ర్ నుంచి బుక్కాలోనే వ‌స్తున్నామ‌ని, కాలేజీ ఐడీ కార్డులో కూడా అలాగే ఫొటోల‌కు దిగామ‌ని చెప్పుకొచ్చారు.

త‌మ‌ను కాలేజీలోకి అనుమ‌తించ‌ని విష‌యాన్ని విద్యార్థినులు పెద్ద‌ల‌కు ఫోన్‌లో స‌మాచారం ఇచ్చారు. క‌ర్నాట‌కలో హిజాబ్ వివాదం నేప‌థ్యంలో ఆందోళ‌న‌కు గురైన ముస్లిం పెద్దలు ప‌రుగునా కాలేజీకి వెళ్లారు. కాలేజీ యాజమాన్యంతో చర్చించారు. దీనికంత‌టికీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కిషోర్ అత్యుత్సాహమే కార‌ణ‌మ‌ని గుర్తించి, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు.

కావాల‌నే ఇదంతా చేశార‌ని, కాలేజీ యాజ‌మాన్యానికి అలాంటి ఉద్దేశం లేద‌ని నిర్ధార‌ణ అయ్యింది. అనంత‌రం హిజాబ్‌తోనే విద్యార్థినుల‌ను త‌ర‌గ‌తి గ‌దుల్లోకి అనుమ‌తించడంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.