అచ్చెన్న ఇలాకాలో జగనన్న…?

ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి కాలు కదిపారు. అంతే వరసబెట్టి ఆయన జిల్లాల‌ టూర్లు వేయాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రా జిల్లాల్లో జగన్ వరస పర్యటనలు ఉన్నాయి. ఈ నెల 23న ముఖ్యమంత్రి…

ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి కాలు కదిపారు. అంతే వరసబెట్టి ఆయన జిల్లాల‌ టూర్లు వేయాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రా జిల్లాల్లో జగన్ వరస పర్యటనలు ఉన్నాయి. ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లా టూర్ ఖరారు అయింది.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకల్లో ఆ రోజు ముఖ్యమంత్రి పాల్గొంటారు. టెక్కలిలో జరిగే ఈ వేడుకలకు హాజరయ్యే ముందు ఆయన అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు అని అధికార వర్గాల సమాచారం.

శ్రీకాకుళంలో జిల్లా ఆసుపత్రి భవనాలను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుడతారు. ఇదిలా ఉండగా విపక్ష నేతగా మూడేళ్ల క్రితం టెక్కలిలో పాదయాత్ర చేసిన జగన్ ఇపుడు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడకు రానున్నారు.

ఈ సందర్భంగా ఆయన టెక్కలి అభివృద్ధికి కూడా హామీ ఇవ్వనున్నారు. అనేక కీలక ప్రతిపాదనలు చేయనున్నారని తెలుస్తోంది. ఇక టెక్కలి రాజకీయాలను కూడా ఆయన వాకబు చేస్తారు అని అంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు అన్న సంగతి విధితమే.

మొత్తానికి జగన్ టెక్కలి రాక కన్ ఫర్మ్ కావడంతో వైసీపీ వర్గాలలో హర్షం వ్యక్తం అవుతోంది. అధికారులు సీఎం టూర్ మీద ఇప్పటికే సమీక్ష చేసి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా కాలం తరువాత ముఖ్యమంత్రి జిల్లా టూర్ నేపధ్యంలో టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలూ అలెర్ట్ అవుతున్నాయి.