ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరం. ఒక విధంగా జీవనాడి లాంటిది హోదా. దీని మీద గత ఎనిమిదేళ్ళుగా ఎన్నో రకాలుగా పోరాటాలు జరుగుతున్నాయి. అయితే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ హోదాని మాత్రం పక్కన పెట్టేస్తోంది, పైగా ఆ ఒక్కటీ తప్ప అని అంటోంది.
ఇక ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ తన వంతుగా చేయాల్సింది చేస్తోంది, కానీ టీడీపీ మాత్రం అడాగాల్సిన కేంద్రాన్ని అడగకుండా వైసీపీ మీద పడుతోంది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ తనదైన శైలిలో ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మేము గట్టిగానే ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళిన ప్రతీ సారీ హోదా ప్రస్థావన తెస్తూనే ఉన్నారు. ఇంకా ఏం చేయమంటారు, హోదా కోసం ప్రధాని పీక నొక్కేయాలా అంటూ టీడీపీ నేతల మీద ఒక్క లెక్కన ఫైర్ అయ్యారు.
హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటం టీడీపీ నేతలకు కనిపించదు, విమర్శలు ఒక్కటే చేస్తున్నారు అని రుసరుసలాడారు. ఇక టీడీపీ ఎంపీలే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా, మాకూ తెలివి తేటలు ఉన్నాయని స్పీకర్ అనడం విశేషం. అదే విధంగా టీడీపీ నేతలు నిజాలు మాట్లాడాలని సూచించారు.
నాడు విభజన సమయంలో తలుపులు మూసి కేంద్రం అడ్డగోలుగా ఆమోదిస్తే ఈ టీడీపీ నేతలు ఏమైపోయారు, ఒక్కరైనా నోరు విప్పి మాట్లాడేరా అని తమ్మినేని నిలదీస్తున్నారు. మొత్తానికి హోదా కోసం తాము పోరాడుతున్నామని, టీడీపీ రాజకీయం చేస్తోందని తమ్మినేని బాగానే మండిపడ్డారు. దీనికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.