గౌతమ్ సవాంగ్ బదిలీ విషయంలో ఏపీ ప్రభుత్వం కక్ష తీర్చుకుందని విష ప్రచారం చేస్తోంది టీడీపీ, దాని అనుకూల మీడియా. అయితే వాస్తవానికి చంద్రబాబు జమానాలోనే ఐఏఎస్ లు, ఐపీఎస్ లు తీవ్ర మనోవేదనకు గురయ్యారనేది అసలు నిజం.
ఉన్నతాధికారులతోనే కాదు, కింది స్థాయి అధికారులతో కూడా సీఎం జగన్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. గ్రామ వాలంటీర్ లను కూడా ఆయన అంతగానే అభిమానిస్తారు, వారి పనితీరుని గౌరవిస్తారు. అలాంటి జగన్ ని కామెంట్ చేసేముందు.. చంద్రబాబు గురివింద నీతి గురించి తెలుసుకోవాలి కదా.
ఉమ్మడి ఏపీలో అయినా, విభజిత ఆంధ్రలో అయినా అత్యథిక సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ లు రాష్ట్రం విడిచి కేంద్ర సర్వీసులకు వెళ్లింది చంద్రబాబు హయాంలోనే. పాత లెక్కలు తీస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో సాంబశివరావు, రణదీప్ సుడాన్, రత్న కిషోర్ వంటివారు చాలామంది చంద్రబాబు హయాంలోనే కేంద్ర సర్వీసులకు వెళ్లారు. మోహన్ కందా లాంటి వారు చంద్రబాబు ఉన్నారు కాబట్టే.. రాష్ట్రానికి దూరంగానే ఉండిపోయినట్టు తెలుస్తోంది.
అంతెందుకు రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో కూడా బాబు అరాచకం అంతా ఇంతా కాదు. ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబుని ఏ రేంజ్ లో ఉతికి ఆరేశారో అందరికీ తెలిసిందే. బాబు జమానాలో సీఎంవో కార్యాలయం అధికార కేంద్రంగా మారిపోయిందని పలుమార్లు బాబుకి ఆయన లేఖలు రాశారు.
మెట్రో శ్రీధరన్ అవమానకర రీతిలో..
మెట్రో మ్యాన్ శ్రీధరన్ ని ఏరికోరి సలహాదారుగా నియమించుకున్న చంద్రబాబు.. ఆయనతో మాట్లాడింది లేదు, ఆయన సలహాలు తీసుకుంది లేదు. దీంతో ఆయన కూడా బాబుపై అలిగి సలహాదారు పదవికి రాజీనామా చేశారు.
సహజంగానే బాబుకి మేధావులు నచ్చరు, వారి సలహాలు తీసుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు, బాబుని పొగడని ఐఏఎస్, ఐపీఎస్ లంటే ఆయనకి బాగా చిరాకు. అందుకే అలాంటి వారందరికీ పొగబెట్టారు, వారే వెళ్లిపోయాలా చేశారు. అలాంటి చంద్రబాబు, ఇప్పుడు హరిశ్చంద్రుడిలా సవాంగ్ బదిలీపై కామెంట్ చేస్తున్నారు, చేయిస్తున్నారు.
గురివింద బాబు..
తన హయాంలో ఐఏఎస్ లను, ఐపీఎస్ లను ముప్ప తిప్పలు పెట్టించేవారు బాబు. పైకి ఒకటి, లోపల మరొకటి ఆయన స్ట్రాటజీ. తేడా కొడతాయి అనుకున్న నిర్ణయాలను అధికారులు ప్రకటించేలా చేసేవారు. క్రెడిట్ వస్తే తన ఖాతాలో వేసుకునేవారు, విమర్శలొస్తే అధికారుల్ని అందరి ముందు తిట్టేవారు. దీంతో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకు బాబు ఓ రాక్షసుడిలాగా కనిపించేవారు.
సమస్యలొస్తే అధికారుల్ని క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పనిచేయనిచ్చేవారు కాదు, లెక్కలు అడిగేవారు. వార్ రూమ్ లు, రియల్ టైమ్ డేటా అంటూ.. హడావిడి పెట్టించేవారు. అటు ప్రజలతో తిట్లు, ఇటు చంద్రబాబుతో తిప్పలు.. ఇలా నలిగిపోయేవారు అధికారులు. ఇంత చేసి, తన రాజకీయ స్వలాభం కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకునేవారు చంద్రబాబు. ఇదీ చంద్రబాబు హయాంలో జరిగిన అరాచకం.