రఘురామ కృష్ణంరాజు వైసీపీ టికెట్ పై గెలిచారు. కానీ వైసీపీని ఏకిపారేస్తూ, జగన్ పాలనను విమర్శిస్తూ ప్రతిపక్షాల మాయలోపడి, సవాళ్లు విసురుతూ కాలం గడుపుతున్నారు. టీడీపీ అనుకూల మీడియాలో కనిపిస్తారు కానీ, సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయన కనిపించరు.
కొన్నాళ్లుగా ఆయన్ను వైసీపీ పూర్తిగా లైట్ తీసుకుంది. ఇప్పుడు మాజీ మంత్రి, ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా అదే కోవలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది.
జిల్లాల పేరుతో గొడవ..
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటివరకూ అధికారపక్షంలో ఎమ్మెల్యే స్థాయిలో ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. స్థానిక నేతలు కాస్త ఆవేశపడినా అవి సర్దుకుంటున్నాయి. ఈ దశలో ఇప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి జిల్లాల విభజనపై విరుచుకుపడ్డారు. సహేతుకంగా జరగలేదని, రైతులు ఇబ్బంది పడతారని, సాగునీటి ప్రాజెక్ట్ ల వద్ద కొట్లాటలు జరుగుతాయని అంటున్నారు. నేరుగా ఉన్నతాధికారుల్నే టార్గెట్ చేసి మాట్లాడారాయన.
ఒకరకంగా ఇది అధిష్టానాన్ని ధిక్కరించడమేనని అంటున్నారు స్థానిక నాయకులు. కానీ ఎవరూ ఆయన విషయంలో నోరు మెదపడంలేదు. ఓ దశలో రామనారాయణ ప్రెస్ మీట్ తర్వాత ఆయనకి వ్యతిరేకంగా జిల్లా వైసీపీ నేతలు మరో ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలని అనుకున్నారట. ఈ విషయం వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాల విభజన సహేతుకం కాదన్న రామనారాయణ కామెంట్లు ఆయన వ్యక్తిగతం అని, మిగతా వారంతా జిల్లాల విభజనపై సంతృప్తిగా ఉన్నారని చెప్పాలనుకున్నారట.
అధిష్టానం లైట్..
అయితే వైసీపీ పెద్దలు మాత్రం జిల్లా నాయకుల్ని వారించారట. ప్రెస్ మీట్ పెట్టి అసంతృప్తిని బహిరంగ పరచొద్దని చెప్పారట. రామనారాయణ రెడ్డిని లైట్ తీసుకోవాలని అన్నారట. దీంతో జిల్లా నాయకుల మీడియా సమావేశం క్యాన్సిల్ అయింది.
ప్రస్తుతం రఘురామకృష్ణంరాజుని ఎలా పార్టీ లైట్ తీసుకుందో.. ఆనంని కూడా అలాగే పక్కనపెట్టాలని చూస్తోంది. ఒకవేళ ఇంకాస్త ముందుకెళ్లి విమర్శలు చేస్తే మాత్రం పార్టీ తరపు నుంచి కూడా కౌంటర్లు పడతాయి.
ఆనం చూపు ఎటువైపు..
ఆనం రామనారాయణ రెడ్డి రెండో దఫా కూడా తనకు మంత్రి పదవి రాదు అని డిసైడ్ అయ్యారు. అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని, జగన్ నిర్ణయాలనే ప్రశ్నిస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. తనపై వేటు వేస్తే సింపతీతో బయటకు వెళ్లాలని చూస్తున్నారు.
ఒకవేళ పార్టీ సాగతీస్తే.. తాను కూడా రఘురామలాగా పక్కలో బల్లెం లాగా మారాలనుకుంటున్నారు. ఏదేమైనా 2024 వరకు ఎమ్మెల్యే పదవిలోనే ఉంటారు, నియోజకవర్గంలో తన సొంత బలాన్ని పెంచుకుంటారు. ఇదీ ఆయన ప్లాన్.