తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు వచ్చిన శుభాకాంక్షల్లో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి.
ప్రధాని మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. వీళ్లిద్దరి శుభాకాంక్షలు ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఇటీవల వీళ్లిద్దరిపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడడమే కారణం. ఈ ఇద్దరు నేతలు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ అగ్రనేతలు కావడం గమనార్హం.
దేశం నుంచి ప్రధాని మోదీని తరిమి కొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆయన నుంచి దీవెనలు రావడం విశేషమే. అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీపై నోటి దురుసు ప్రదర్శించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను బర్తరఫ్ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తనను బర్తరఫ్ చేయాలని కోరిన కేసీఆర్‌ను గుర్తు పెట్టుకుని, జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం బీజేపీ రాజకీయ వ్యూహానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.
కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అదెంటో చూద్దాం. “తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా” అని మోదీ ట్వీట్ చేశారు. ఇదే సందర్భంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా విషెస్ చెప్పారు. “తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరనేందుకు ఈ శుభాకాంక్షలే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.