ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ద్వేషించే వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాగని మరీ హద్దులు దాటి విమర్శలు చేయడం గమనార్హం. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎందుకనో జగన్ విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో నారాయణతో పాటు సీపీఐ నాయకులు సన్నిహిత సంబంధాలు కలిగి వుండేవారు.
తమను వైఎస్సార్ ఎంతగానో ఆదరించే వారని సీపీఐ నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. తండ్రిలాగా తనయుడు దగ్గరికి తీయలేదనో కోపమో, మరే కారణమో తెలియదు కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకుల కంటే దారుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ఆయన ప్రభుత్వాన్ని సీపీఐ నేతలు విమర్శిస్తారు.
ఈ నేపథ్యంలో మరోసారి జగన్‌పై నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఇవాళ అనంతపురంలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ తండ్రిని కూడా అంతమొందించే క్యారెక్టర్ జగన్‌ది అని పరోక్షంగా నారాయణ విమర్శించారు. ఏపీలో కోల్డ్ మర్డర్ వ్యవస్థ ఉందని ఆరోపించారు. ఇది అత్యంత ప్రమాదకరమన్నారు. వైఎస్ వివేకా హత్యపై రాష్ట్రంలో చర్చ జరుగు తోందని తెలిపారు. ఏకంగా సీబీఐపైనే సుప్రీంకోర్టుకు వెళ్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అంటున్నారన్నారు.
రాష్ట్రంలో ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఒకవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డం ఉంటే ఆయనను కూడా ఏం చేసేవారో అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉధ్దేశించి నారాయణ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిదీ అనుమానంతో చూసే రాజకీయ పరిస్థితులు నెలకున్నాయన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే సీబీఐను సపోర్ట్ చేస్తారని, లేకుంటే వ్యతిరేకిస్తారని నారాయణ అన్నారు.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐ చార్జిషీట్ సమర్పించడాన్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు పట్టడాన్ని నారాయణ పరోక్షంగా ప్రస్తావించారు. సీబీఐ చార్జిషీట్‌పై న్యాయపోరాటం చేస్తామని సజ్జల చెప్పిన నేపథ్యంలో నారాయణ వెటకరించారు.
సొంత చిన్నాన్న కేసు విచారణను ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందనే అనుమానంతో, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉదంతాన్ని ఆయన తెరపైకి తెచ్చారని అర్థం చేసుకోవాలి. అయితే సొంత తండ్రిని కూడా ఏదైనా చేసే మనస్తత్వం జగన్‌ది అని అర్థం వచ్చేలా నారాయణ మాట్లాడ్డాన్ని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. మరీ ఇంత నీచమైన వ్యాఖ్యలా అని వారు ప్రశ్నిస్తున్నారు.