కొత్త పలుకు…కొత్త సంగతులు

ఆంధ్రజ్యోతి ఆర్కే కు తెగింపు వుంది. ఉన్నదైనా, లేనిదైనా రాయాలనుకున్నది రాస్తారు. ఎవరైనా గొడవకో, మరోదానికో దిగుతారనే జంకు, గొంకు లేదు. ఎంత అల్లరి అయితే అంతకు అంతా ఫేమస్ అయిపోతామని అనుకుంటారో..లేదా ఎంత…

ఆంధ్రజ్యోతి ఆర్కే కు తెగింపు వుంది. ఉన్నదైనా, లేనిదైనా రాయాలనుకున్నది రాస్తారు. ఎవరైనా గొడవకో, మరోదానికో దిగుతారనే జంకు, గొంకు లేదు. ఎంత అల్లరి అయితే అంతకు అంతా ఫేమస్ అయిపోతామని అనుకుంటారో..లేదా ఎంత వరకు వెళ్తుందో చూద్దాం అనుకుంటారో. మొత్తం మీద కాస్త సంచలన ఆరోపణలు చేస్తుంటారు.. రాస్తుంటారు. ఈవారం అలాగే చేసారు. 

తెలంగాణలో సిఎమ్ కేసీఆర్‌, ఆయన పార్టీ ఎన్నికలకు ఎన్ని వేల కోట్లు ఎలా సిద్దం చేస్తోందో రాసుకువచ్చారు. ఇద్దరు ఐఎఎస్ అధికారులు పూర్తిగా కేసిఆర్ సేవలో తరిస్తున్నారని, పేర్లతో సహా ఆరోపించారు. తెలంగాణలోని సంస్థలను తెరాస (భారాస) ఎన్నికల డొనేషన్ల కోసం టార్గెట్ లు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. వంద కోట్లు, రెండు వందల కోట్ల వంతున భారీ ఫార్మా కంపెనీల నుంచి ఎలక్ట్రోల్ బాండ్ ల రూపంలో వసూలు చేస్తున్నారని వెల్లడించారు.

ఇవన్నీ చిన్నా చితకా ఆరోపణలు కావు. తెలంగాణ ప్రభుత్వం మీద ఇంత నేరుగా గతంలో ఎప్పుడూ తెలుగు మీడియా దాడికి దిగలేదు. అలాంటిది గత కొన్ని నెలలుగా ఆర్కే తన కొత్త పలుకులో మాత్రం కేసీఆర్‌ ను టార్గెట్ చేస్తునే వున్నారు. ఈవారం టార్గెట్ ఎలా సాగింది అంటే…

‘’..దాదాపు 8 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఒక భూ వివాదంలో ప్రభుత్వ వాదన వీగిపోయేలా చూడాల్సిందిగా కేసీఆర్‌ కోరారు

‘’..ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలికాలంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది..’’

‘‘న్యాయ స్థానాల నుంచి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకోండి.. భూములు సొంతం చేసుకోండి’’ అనే నినాదం ఇప్పుడు తెలంగాణలో హల్‌చల్‌ చేస్తోంది.

‘’..తెలంగాణలో కొంతమంది అధికారులు కూడా నియమ నిబంధనలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయడానికే తామున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటివారిలో అరవింద్‌ కుమార్‌, జయేశ్‌ రంజన్‌ ముందు వరుసలో ఉంటారు..’’

‘’..జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచే కేసీఆర్‌ వ్యవహార సరళిలో మార్పు వచ్చిందని కొంతమంది అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తుల పాల్జేయాలనుకోవడం ఇందులో భాగమేనని అంటున్నారు..’’

‘’..కేసీఆర్‌, ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు పెట్టుబడి పెడుతున్నారని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇందుకు అవసరమైన నిధుల కోసం భూములపై కన్నేశారు. భూముల డీల్స్‌ అన్నీ ఫైనల్‌ స్టేజ్‌లో ఉన్నాయి. అవి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వాటి గురించి చెప్పుకొందాం…’’

..ఎలక్టోరల్‌ బాండ్స్‌ ఇవ్వాలని పారిశ్రామిక సంస్థలకు పై నుంచే ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే 10 కోట్ల వరకు సహాయం చేసే కంపెనీలకు కూడా ఇప్పుడు టార్గెట్‌ విధిస్తున్నారు. రెండు పెద్ద పెద్ద కంపెనీలను 200 కోట్ల రూపాయల వరకు బాండ్లు ఇవ్వాలని ఆదేశించారు. ఒక కంపెదీ ప్రస్తుతానికి 100 కోట్ల మేరకు బాండ్లు ఇచ్చుకున్నారట’’

‘’..అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల వ్యవధి ఉంది. అప్పటివరకూ ఎన్ని ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులపరం చేస్తారో చూద్దాం. తాజాగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ వ్యవహారం ప్రభుత్వానికి చుట్టుకుంది. ఇందులోనుంచి కేసీఆర్‌ ఎలా బయటపడతారో చూడాలి..’’

ఇంతకీ ఈ ఆరోపణలు అన్నింటికీ ముక్తాయింపు ఇస్తూ ఆర్కే చెప్పినదేమిటంటే….జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీల నాయకులెవరూ కేసీఆర్‌ వలే డబ్బుతో చక్రం తిప్పలేదు. ఇది కేసీఆర్‌ మాత్రమే ఎంచుకున్న విధానం. ఈ పోకడలను గమనిస్తున్న తెలంగాణ సమాజం రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎటువంటి తీర్పు ఇస్తుందో వేచి చూద్దాం…అన్నదే..

గమ్మత్తేమిటంటే ఇంతబలమైన ఆరోపణలు ఆంధ్రజ్యోతి చేసినా, వాటి వైపు ఈనాడు కన్నెత్తి కూడా చూడకపోవడం, వాటి మీద పరిశోధనాత్మక కథనాలు వండి వార్చకపోవడం. అవును మరి..ఆంధ్ర కాదు..ఇక్కడున్నది జగన్ కాదు.