స‌వాంగ్‌కు పోస్టింగ్ – షాక్ ఎవ‌రికంటే?

ఐపీఎస్ అధికారి గౌత‌మ్ స‌వాంగ్‌కు కీల‌క పోస్టు ద‌క్కింది. ఆయ‌న్ను ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఈ ప‌ద‌విలో ఆయ‌న ఐదేళ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. రెండు రోజుల క్రితం గౌత‌మ్…

ఐపీఎస్ అధికారి గౌత‌మ్ స‌వాంగ్‌కు కీల‌క పోస్టు ద‌క్కింది. ఆయ‌న్ను ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఈ ప‌ద‌విలో ఆయ‌న ఐదేళ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. రెండు రోజుల క్రితం గౌత‌మ్ స‌వాంగ్‌ను డీజీపీగా త‌ప్పించ‌డం రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. దీన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు వాడుకోవాల‌నే ప్ర‌య‌త్నాల‌ను వేగవంతం చేశాయి.

త‌న అవ‌స‌రాల‌కు వాడుకుని, ఆ త‌ర్వాత ప‌క్క‌న ప‌డేయ‌డం జ‌గ‌న్ నైజ‌మ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ సంద‌ర్భంగా మాజీ సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం, ప్ర‌వీణ్‌ప్ర‌కాశ్ త‌దిత‌ర అధికారుల బ‌దిలీల‌ను స‌వాంగ్ ఎపిపోడ్‌కు ముడిపెట్టారు. స‌వాంగ్‌ను అక‌స్మికంగా బ‌దిలీ చేయ‌డం, అలాగే ఎలాంటి పోస్టు ఇవ్వ‌కుండా సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌లో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించ‌డంతో ప‌నిష్మెంట్ కింద లెక్క క‌ట్టారు.

ఈ నేప‌థ్యంలో గౌత‌మ్ స‌వాంగ్‌కు ఏపీపీఎస్పీ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి, ఆయ‌న‌పై త‌న ప్రేమాభిమానాల‌ను జ‌గ‌న్ చాటుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే గౌత‌మ్ వ‌చ్చే ఏడాది ప‌ద‌వీ విరమ‌ణ చేయ‌నున్నారు. కానీ ఏపీపీ ఎస్సీ చైర్మ‌న్‌గా, ప‌ద‌వీ విర‌మ‌ణతో సంబంధం లేకుండా ఐదేళ్లు కొన‌సాగే అవ‌కాశాన్ని సీఎం జ‌గ‌న్ క‌ల్పించారు. స‌వాంగ్‌ను బ‌దిలీ చేసిన వెంట‌నే, అంత వ‌ర‌కూ ఆయ‌న్ను విమ‌ర్శించిన వాళ్లంతా ప్రేమ కుమ్మ‌రించారు.

అలాంటి వాళ్ల‌కు షాక్ ఇస్తూ, స‌వాంగ్‌కు సీఎం కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌ని చెప్పొచ్చు. ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాల వెనుక వ్యూహం వుంటుంద‌నేందుకు స‌వాంగ్‌కు ప్రాధాన్య పోస్టు ఇవ్వ‌డ‌మే నిద‌ర్శ‌నమ‌ని చెబుతున్నారు. గౌత‌మ్ స‌వాంగ్ బ‌దిలీపై క‌నీసం రెండు రోజులు కూడా దుష్ప్ర‌చారానికి అవ‌కాశం ఇవ్వ‌కుండా షాక్ ఇచ్చార‌నే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.