బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా, ఓ సామాన్య దళితుడిగా, కెమెరామన్‌గా ప్రజల్లో విశేష ఆదరణ పొందారు. బాపట్ల ఎంపీ టికెట్‌ను ఓ సాధారణ దళితుడికి జగన్ ఇచ్చారనే ప్రచారం వైసీపీకి రాజకీయంగా బాగా లాభించింది. దళితులతో పాటు ఇతర వర్గాల్లో కూడా జగన్ నిబద్ధతపై నమ్మకం ఏర్పడింది. అయితే నాడు పార్టీకి బలంగా ఉపయోగపడిన ఆయన… నేడు తొండముదిరి ఊసరవెల్లి అయిన చందాన్ని తలపిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో నందిగం సురేష్ వీరంగం సృష్టించారనే ప్రచారం ముమ్మాటికీ ప్రభుత్వానికి, వైసీపీకి నష్టం కలిగించేందే. మరోవైపు ఈ ప్రచారాన్ని నందిగం సురేష్ కొట్టిపడేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో జరిగింది ఒకటైతే, నచ్చనివారు మరో రకంగా ప్రచారం చేస్తున్నారని నందిగం ఖండించారు. ఎక్కడెక్కడో జరిగిన దాన్ని తన మీదకు వేస్తే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
గతంలో చంద్రబాబు హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా ఇదే రకంగా వ్యవహరించారు. ఆయన వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీపై నెగెటివ్ ప్రభావం పడింది. చివరికి టీడీపీ అధికారం కోల్పోవడానికి చింతమనేని వ్యవహారశైలి కూడా ఒక కారణమనే అభిప్రాయం లేకపోలేదు. చింతమనేని లోటును తాను తీర్చాలని నందిగం భావిస్తున్నారా? ఇల్లు, వాకిలి, భార్యా బిడ్డల్ని వదిలి, సంవత్సరాల తరబడి జగన్ జనంలో తిరుగుతూ, ఎన్నెన్నో తిప్పలు పడి జగన్ అధికారాన్ని దక్కించుకున్నారు. అలాంటిది ఆయన ప్రమేయం లేకుండా, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా నందిగం సురేష్ వ్యవహరించడం ఏంటనే ప్రశ్నలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తుతున్నాయి.
అర్ధరాత్రి విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తన అనుచరులతో వెళ్లి గంటకు పైగా వీరంగం సృష్టించారనేది ప్రచారం. తనకు బంధువులైన యువకులను పోలీసులు తీసుకెళ్లి విచారించడాన్ని ఎంపీ జీర్ణించుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా బాపట్ల ఎంపీ బంధువులమని చెప్పినా, పోలీసులు సదరు యువకులను విడిచిపెట్టకపోవడం సురేష్ ఇగోను దెబ్బతీసింది. దీంతో నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన మార్క్ వ్యవహార శైలిని ప్రదర్శించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
గతంలో కూడా ఇసుక ట్రాక్టర్లను విడిచి పెట్టలేదని పోలీసు అధికారులతో దురుసుగా మాట్లాడ్డం చర్చనీయాంశమైంది. ఈ దఫా పోలీస్‌స్టేషన్‌లో వీడియో తీస్తున్న పోలీసుపై దాడికి పాల్పడడం దేనికి నిదర్శనం. ఇలాగైతే ప్రభుత్వానికి చెడ్డపేరు రాదా? ఇప్పటికే నందిగం సురేష్‌పై బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారు. ఇసుక మాఫియా, ఇతరత్రా అంశాల్లో ఎంపీ జోక్యం ఎక్కువై, తమకు రాజకీయంగా నష్టం కలుగుతోందని వారంతా వాపోతున్నారు. నందిగం సురేష్ ఎపిసోడ్‌కి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎల్లో మీడియా ప్రచారమనో, మరొకటనో కప్పి పుచ్చుకుంటే, పరువు పోయేది పార్టీది అని గ్రహిస్తే మంచిది.