అఖిల‌ప్రియ త‌మ్ముడు మ‌ళ్లీ ప‌రార్

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత భూమా అఖిల‌ప్రియ త‌మ్ముడు జ‌గత్‌విఖ్యాత్‌రెడ్డి మ‌ళ్లీ ప‌రార‌య్యాడు. ఈ ద‌ఫా క‌ర్నూలు పోలీసుల దెబ్బ‌కు ఎవ‌రికీ క‌నిపించ‌కుండా త‌ల‌దాచుకోవాల్సి వ‌చ్చింది. మ‌రో వైపు పోలీసుల నుంచి త‌న…

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత భూమా అఖిల‌ప్రియ త‌మ్ముడు జ‌గత్‌విఖ్యాత్‌రెడ్డి మ‌ళ్లీ ప‌రార‌య్యాడు. ఈ ద‌ఫా క‌ర్నూలు పోలీసుల దెబ్బ‌కు ఎవ‌రికీ క‌నిపించ‌కుండా త‌ల‌దాచుకోవాల్సి వ‌చ్చింది. మ‌రో వైపు పోలీసుల నుంచి త‌న త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డికి ప్రాణ‌హాని ఉంద‌ని అఖిల‌ప్రియ ఆరోపించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

అఖిల‌ప్రియ త‌మ్ముడు జ‌గ‌త్‌, భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌కు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ‌కుండా ప‌రారు కావ‌డం స‌ర‌దా అయ్యింద‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. హైద‌రాబాద్‌లో ఒక స్థ‌ల వివాదానికి సంబంధించి కిడ్నాప్‌న‌కు పాల్ప‌డిన కేసులో అఖిల‌ప్రియ అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. అదే కేసులో పోలీసుల‌కు చిక్క‌కుండా భార్గ‌వ్‌రామ్‌, జ‌గ‌త్ చాలా రోజులు త‌ప్పించుకు తిరిగారు. ఆ కేసులో బెయిల్ పొందిన త‌ర్వాతే ఊపిరి పీల్చుకున్నారు.

ఆ త‌ర్వాత అదే కేసులో పోలీసుల విచార‌ణ నుంచి త‌ప్పించుకునేందుకు త‌ప్పుడు కోవిడ్ స‌ర్టిఫికెట్ల‌ను స‌మ‌ర్పించి మ‌రొకసారి దొరికిపోయారు. ఈ కేసులో కూడా బావాబామ్మ‌ర్ది కొన్ని రోజులు ప‌రార‌య్యారు. అనంత‌రం మ‌ళ్లీ బెయిల్ తెచ్చుకుని ఇంటికి తిరిగొచ్చారు. తాజాగా మ‌రోసారి జ‌గ‌త్ ప‌రార్‌లో ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

ఆళ్ల‌గ‌డ్డ‌లో రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప్ర‌భుత్వం చేప‌ట్టింది. ఇందులో భాగంగా భూమా నాగిరెడ్డి పేరుతో ఉన్న బ‌స్సు షెల్ట‌ర్‌ను కూడా తొల‌గించారు. దీనిపై జ‌గ‌త్ విఖ్యాత్ తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనై సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి పోలీసులు, మున్సిప‌ల్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను యూజ్‌లెస్ ఫెలో అంటూ తిట్టారు.

ఒక పోలీస్‌ను కొట్టేందుకు జ‌గ‌త్ చెయ్యెత్తాడ‌ని అంటున్నారు. జ‌గ‌త్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై ఆళ్ల‌గ‌డ్డ పోలీసులు కేసు న‌మోదు చేశారు. జ‌గ‌త్ రౌడీయిజంపై క‌ర్నూలు ఎస్పీ సీరియ‌స్‌గా ఉన్నారు. త‌గిన రీతిలో ట్రీట్‌మెంట్ ఇస్తే త‌ప్ప దారికి రాడ‌నే అభిప్రాయంలో ఆళ్ల‌గ‌డ్డ పోలీస్‌శాఖ ఉంది. ఈ నేప‌థ్యంలో దొరికితే చిత‌క్కొడుతార‌నే భ‌యంతో జ‌గ‌త్ ప‌రార‌య్యాడు. ఈ నేప‌థ్యంలో త‌న త‌మ్ముడికి పోలీసుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని అఖిల‌ప్రియ ఆరోపించ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.