మల్టిలెవెల్ మార్కెటింగ్ వ్యూహంతో పచ్చదళాలు!

‘జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి పగ్గాలు చేపట్టకూడదు’ ఇదొక్కటే వారందరికీ లక్ష్యం. అందుకోసం ఏం చేయడానికైనా వారు సిద్ధం. సాధారణంగా ఈ ధోరణి రాజకీయ పార్టీకి మాత్రమే ఉండాలి. కానీ.. పార్టీలతో పాటు మీడియా…

‘జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి పగ్గాలు చేపట్టకూడదు’ ఇదొక్కటే వారందరికీ లక్ష్యం. అందుకోసం ఏం చేయడానికైనా వారు సిద్ధం. సాధారణంగా ఈ ధోరణి రాజకీయ పార్టీకి మాత్రమే ఉండాలి. కానీ.. పార్టీలతో పాటు మీడియా మూకలు కూడా ఇదే లక్ష్యాన్ని తమ ఒళ్లంతా పులుముకుని పనిచేస్తున్నాయి. పచ్చ దళాలు అన్నీ కూడ ఒక రకమైన మల్టిలెవెల్ మార్కెటింగ్ వ్యూహంతో పనిచేస్తున్నాయా అనిపిస్తోంది. అయితే ఇలాంటి వ్యూహాత్మక ప్రచారాలను అధికార పార్టీ కనీసం గుర్తించలేకపోతున్నదని అనిపిస్తోంది. 

ఒక్క ఉదాహరణ తీసుకుంటే.. గోదావరి జిల్లాల్లో తడిచిన ధాన్యం కొనుగోలు విషయం గమనిద్దాం. అకాల వర్షాల రైతులోకాన్ని ముంచెత్తిన తరుణంలో ప్రభుత్వం పరంగా ఎన్ని ఏర్పాట్లు చేయాలో, జగన్ ప్రభుత్వం అన్నీ చేసింది. కానీ విపక్షాల వైఖరి ఎలా ఉంది? తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు.. అని చంద్రబాబునాయుడు గోల చేయడం ప్రారంభించారు. 

ఆయన గోల కంటె ముందే ప్రభుత్వం తడిచిన, రంగుమారిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేసింది. దాన్ని చూసి వెంటనే నేను ఎక్కడ పర్యటిస్తోంటే అక్కడ ధాన్యం కొంటున్నారు… అంటూ చంద్రబాబు ఒక అసంబద్ధమైన ప్రకటన చేశారు. సరే ఆయనేదో తనకు మైలేజీ కావాలని అలాంటి బొంకులు ప్రజలకు మీదకు సంధిస్తున్నారని అనుకుందాం. ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఒకచోట చిరిగిన గోతాలు వచ్చాయి. ఇది వార్తగా కూడా వచ్చింది. చిరిగిన గోతాం రావడం అసంబద్ధమైన, అసహజమైన విషయం కాదు. నేరమూ ఘోరమూ కూడా కాదు. దిద్దుకోదగిన పొరబాటు. 

కానీ ఇప్పుడు మీడియా కూడా పచ్చరంగు పులుముకుని పనిచేస్తున్నది గనుక అది వార్తగా వచ్చింది. ధాన్యం కొనడానికి చిరిగిన గోతాలు పంపుతారా? అంటూ చంద్రబాబు గదమాయించారు. దానిని మళ్లీ పచ్చమీడియా అందుకుంది. ధాన్యం కొనుగోళ్లకు చినిగిన గోతాలనే పంపుతున్నారంటూ యాగీ ప్రారంభించింది. మళ్లీ చంద్రబాబు తైనాతీలు, పెయిడ్ కూలీలు, వందిమాగధులు దానిని అందుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు కనీసం గోతాలకు కూడా గతిలేనిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? అంటూ తమ స్థాయి జోడింపులు చేసి.. సమస్యను మరింత పెద్దది చేశారు. 

ఏమిటీ విష ప్రచారం. జరిగిన తప్పు ఏమిటి? దాని స్థాయి ఎంత? ఒకచోట కొన్ని గోతాలు చిరిగినవి వచ్చినంత మాత్రాన అది బ్రహ్మాండం బద్ధలైపోయేంత సమస్యనా? దానివల్ల రైతులోకానికి ఎంత నష్టం వచ్చింది? ఇలాంటి వాస్తవిక ఆలోచనా దృక్పథం ఎవరికీ అక్కర్లేదు. ప్రజలు తమ సొంత బుర్రలతో ఆలోచించుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా ఈ పచ్చ మీడియా తమ బుర్రలోని విషాన్ని లోకం మీదకు చల్లుతుంటుంది. 

ఒక చిన్న పొరబాటు జరిగితే ‘మల్టీ లెవల్స్’ లో దాన్ని చిలవలు పలవలుగా మారుస్తూ రాష్ట్రంలోని వ్యవసాయరంగాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తున్నట్టుగా జరిగే ప్రచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఈ కుట్రప్రచారాలను ప్రజలు గుర్తిస్తారా? కనీసం పాలకపక్షం గుర్తిస్తున్నదా? అనేది అనుమానం.