కర్ణాటక రాజకీయ నేతలు చాలా రిచ్ అని అంటున్నాయి అధ్యయనాలు. ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులలో దాదాపు అందరూ కోటీశ్వరులే! ఆ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం అంటూ తేడా లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అంటూ లేదు… అన్ని పార్టీల తరఫున బరిలోకి దిగింది, అన్ని నియోజకవర్గాల బరిలో ఉన్నది కూడా కోటీశ్వరులే కావడం గమనార్హం. అధ్యయనాల ప్రకారం.. కర్ణాటకలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఆస్తులు సగటున 12 కోట్ల రూపాయలు! ఇవి కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం, అభ్యర్థులు అధికారికంగా తెలిపిన వివరాలు.
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఆస్తుల ప్రకటన సాధారణంగానే కామెడీగా ఉంటుంది. వందల కోట్ల ఆస్తి పరుల కూడా వేల రూపాయల్లో ఆస్తులను చూపుతూ ఉంటారు. తమ పేరిట కారు లేదని, తమకు సొంతిల్లు లేదని ఇలా రకరకాల ఆశ్చర్యాలను అభ్యర్థులు పోగేస్తూ ఉంటారు. మరి అలాంటి ప్రకటనల సగటు తీసినా కర్ణాటక ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున నిలిచిన వారి సగటు ఆస్తి విలువ 12 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
భారతీయ జనతా పార్టీ బరిలోకి నిలిచిన వారిలో 216 మంది కోటీశ్వరులు. అదే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచిన వారిలో 215 మంది కోటీశ్వరులు కావడం గమనార్హం! కర్ణాటకలో ఉన్నది 224 స్థానాలైతే.. రెండు ప్రధాన పార్టీల తరఫున కనీసం 215 మంది కోటీశ్వరులు కావడం గమనార్హం. అంటే ఏడెనిమిది మందిని మినహాయిస్తే అన్ని నియోజకవర్గాల్లోనూ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ల తరఫున కోటీశ్వరులే బరిలో నిలిచారు. వారంతా వ్యక్తిగతంగా, కుటుంబ ఆస్తుల పరంగా కోటీశ్వరులు. మరి మార్కెట్ విలువల ప్రకారం వీరి ఆస్తుల విలువ ఏ స్థాయిలో ఊహిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
జేడీఎస్ నుంచి బరిలో నిలిచిన వారిలో 170 మంది కోటీశ్వరులు. అంతే కాదు.. సామాన్యుల పార్టీ, చీపురు పార్టీగా పేర్గాంచిన ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కూడా 190 మంది కోటీశ్వరులు బరిలోకి దిగడం విశేషం. అదే ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన వారిలో కూడా 215 మంది కోటీశ్వరులు ఉన్నారు! ఇలా పార్టీ లు తేడా లేకుండా చిన్నా పెద్దా తేడా లేకుండా… అంతా కోటీశ్వరులే! ఇలా అంతా కోటీశ్వరులే బరిలోకి దిగిన ఎన్నికలుగా కూడా కర్ణాటక ఎన్నికలు ప్రత్యేకంగా నిలుస్తూ ఉన్నాయి.
మరి పేరుకు కోటీశ్వరులే కాదు.. ఎన్నికల ఖర్చు విషయంలో కూడా కర్ణాటక రాజకీయ నేతలు దుమ్మురేపుతున్నారనే అభిప్రాయాలున్నాయి. విజయమే పరమావధిగా అభ్యర్థులు ఎన్నికల ఖర్చు పెడుతున్నారని టాక్. ఇలా వీరి ఎన్నికల ఖర్చు కనీసం యాభై కోట్ల రూపాయల పైనే అనే ప్రచారం జరుగుతూ ఉంది.
కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఇలా తేడా లేకుండా.. గెలుపు కోసం పోరాడుతున్న ప్రతి అభ్యర్థీ కనీసం యాభై కోట్ల రూపాయలు తమ నియోజకవర్గం పరిధుల్లో ఖర్చు చేస్తున్నారని సమాచారం. సగటున ఒక్కో అభ్యర్థి యాభై కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేసి విజయం కోసం పోరాడుతున్నారని తెలుస్తోంది. ఇలా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్నవిలాగా ఉన్నాయి.
ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు ఎలా అయినా డిమాండ్ ఉంటుందక్కడ. సొంత పార్టీలో అయినా , ఫిరాయించినా లాభమే. ఎలాగోలా ఎమ్మెల్యే అయితే చాలు.. ఆ తర్వాత కమిషన్లు, ఫిరాయిస్తే ఒక రేటు, ఫిరాయించకపోతే మరో రేటు. ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడమే ముఖ్యమంత్రి పని. తన పదవి నిలబెట్టుకోవాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉంటే చాలన్నట్టుగా వారికి రకాలుగానూ సీఎం అండగా ఉంటారు! ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు అయినా సరే.. ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడకపోరా అనే లెక్కలు కూడా అక్కడ సహజమే.
ఇలా ఎలా చూసినా.. కర్ణాటకలో జస్ట్ ఎమ్మెల్యేగా గెలిచేస్తే కనీసం ఐదేళ్లలో ఐదారు వందల కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు మార్గం దొరికినట్టే అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీంతో.. కోటీశ్వరులు తమ పెట్టుబడులను పెట్టేందుకు రాజకీయం మంచి రంగంగా భావించి బరిలోకి దిగుతున్నారు.
-హిమ