మొన్నటివరకు గౌతమ్ సవాంగ్ పై విమర్శలు చేశారు టీడీపీ వాళ్లు. ఢిల్లీకి వెళ్లి మరీ ఆయనపై ఫిర్యాదులు చేశారు. సీఎం జగన్ ఆడించినట్టు ఆడుతున్నారని, పోలీసు డ్రెస్ పరువు తీశారని, డీజీపీ పోస్ట్ ని తాకట్టు పెట్టారని.. అబ్బో ఇలా చాలానే విమర్శలు చేశారు. లోకేష్ ఓ అడుగు ముందుకేసి.. అందర్నీ గుర్తుపెట్టుకుంటామని, బదులు తీర్చుకుంటామంటూ సినిమా డైలాగులతో రెచ్చిపోయారు.
ఆయన్ని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బదిలీ చేశాక వాస్తవంగా టీడీపీ సంతోషించాలి. కానీ టీడీపీ విమర్శలకు పదును పెట్టింది. సవాంగ్ ని అవమానకర రీతిలో తప్పించారని రాద్ధాంతం మొదలు పెట్టింది. ఇక్కడ టీడీపీకి దొరికిన మరో పాయింట్ కొత్త డీజీపీ కులం. రాజేంద్రనాథ్ రెడ్డి ని కొత్త డీజీపీగా ప్రభుత్వం నియమించడంతో టీడీపీలో కొంత మంది జనాలు కులం కార్డును తెరపైకి తెచ్చారు.
మరి చంద్రబాబు హయాంలో జరిగిందేంటి..?
చంద్రబాబు హయాంలో జరిగిందేంటి.. లెక్కలు తీస్తే ఏం తేలుతాయి. ఏబీ వెంకటేశ్వరరావుని ఏరికోరి తెచ్చారు కదా, ఆయన కృష్ణాజిల్లా నూజివీడు మండలం ముక్కొల్లుపాడుకి చెందిన చౌదరి కాదా..? కానీ వైసీపీ ఎప్పుడైనా ఏబీని కమ్మ అని కామెంట్ చేసిందా..? ఆయన అక్రమాలని మాత్రమే బయటపెట్టింది.
న్యాయపోరాటం చేసింది. మరిప్పుడు రెడ్డి కులానికి చెందినవారు డీజీపీ అయితే టీడీపీకి వచ్చిన నష్టమేంటి..? వాస్తవానికి గౌతమ్ సవాంగ్ స్థానంలో ఎవరొచ్చినా టీడీపీ విమర్శలు చేసేదే. ఆయన సీనియార్టీకి వంకలు పెట్టేదే. సరిగ్గా రాజేంద్రనాథ్ రెడ్డి రావడంతో టీడీపీ ఏడుపుకి అదనపు అవకాశం దొరికినట్టయింది.
టీడీపీ నేతలంతా జైల్ భరో ఖాయమేనా..?
ఎక్కడో ఈశాన్య రాష్ట్రానికి చెందిన గౌతమ్ సవాంగ్ ఉన్నప్పుడే.. పోలీసులంతా వైసీపీకి వత్తాసు పలికారని అన్నారు టీడీపీ నేతలు. మరిప్పుడు ఏపీకి చెందిన వ్యక్తి, అందులోనూ సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోలీస్ బాస్ గా వచ్చాడు కదా. ఇప్పుడు టీడీపీ నేతలకి చుక్కలు చూపించడం ఖాయమేనా..? అలా చేస్తే టీడీపీ నేతలంతా జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే కదా. టీడీపీ అనుమానాలు నిజమైనా, అబద్ధమైనా వారికే నష్టం. అయితే ఈ నియామకంతో టీడీపీ నీఛ రాజకీయాలు మరోసారి బయటపడినట్టైంది.
ముఖ్యమంత్రిగా రెడ్డి ఉంటే పోలీస్ బాస్ గా మరో రెడ్డి ఉండకూడదా? ఏంటీ వితండవాదం. గతంలో చంద్రబాబు.. తన కమ్యూనిటీకి చెందిన ఎంతోమందిని కీలక పదవుల్లో పెట్టుకోలేదా? సీనియార్టీని కాదని రెడ్లకే ప్రయారిటీ ఇచ్చేట్టుంటే.. అసలు గౌతమ్ సవాంగ్ కి జగన్ ఎందుకు అవకాశమిస్తారు. ఇన్నాళ్లు ఎందుకు కొనసాగిస్తారు? అప్పుడే రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పోస్టింగ్ ఇచ్చేవారు కదా. ఈ లాజిక్ చంద్రబాబు ఎలా మిస్ అయ్యారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి సీనియారిటీ జాబితాను ఫాలో అవ్వని మాట నిజమే. కానీ ఆ జాబితాను గతంలో ఎంత మంది ఫాలో అయ్యారు. తమకు నచ్చిన వ్యక్తిని, సమర్థుడ్ని నియమించుకునే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఉన్నప్పుడు, సీనియారిటీ జాబితాను హైలెట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంతకుముందు చంద్రబాబు అలా సీనియార్టీ పద్ధతిలోనే నియామకాలు జరిపారా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీడీపీ జనాలు విమర్శలు చేస్తే బాగుంటుంది.