కన్నీటి బాలినేనికి కార్పోరేటర్ నుంచి సవాల్

ఆ మాజీ మంత్రి అసలే పుట్టెడు కష్టాలలో ఉన్నారు. ఏడాది క్రితం మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి ఆయన ముఖంలో కళ లేదు అని టాక్. ఆయనకు పార్టీలో ప్రాధ్యాన్యత దక్కలేదని భావిస్తూ…

ఆ మాజీ మంత్రి అసలే పుట్టెడు కష్టాలలో ఉన్నారు. ఏడాది క్రితం మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి ఆయన ముఖంలో కళ లేదు అని టాక్. ఆయనకు పార్టీలో ప్రాధ్యాన్యత దక్కలేదని భావిస్తూ ఏడాది నుంచి అలా దిగాలుగానే గడిపేశారు. అలక పనులు ఎక్కే నేతగా వైసీపీలో పేరు తెచ్చుకున్నారు.

నిన్నటికి నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. బాలినేనికి విశాఖ నుంచి జనసేన కార్పోరేటర్ కొంతకాలంగా విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతూనే ఉన్నారు. బాలినేని వియ్యంకుడు విశాఖలో కాపురం ఉంటారు. అలా ఇద్దరినీ కలిపి ఆయన ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చారు.

గతంలో ఆరోపణలు చేసినపుడు బాలినేని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్. ఇపుడు ఆయన ఆ పదవి సైతం వదిలేసుకుని బేలగా కన్నీరు పెడుతున్న టైం లో అన్నీ చూసుకుని ఈ కార్పోరేటర్ బలంగానే విమర్శలు చేశారు. విశాఖ జిల్లాలో వందల కోట్ల విలువైన మైనింగ్ అక్రమాల మీద బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమీ లేదని అంటున్నారని, ఉన్నాయని చెప్పడానికి తాను సవాల్ చేస్తున్నానని జనసేన కార్పోరేటర్ మూర్తీ యాదవ్ మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామంలో భూ కబ్జాల పైన నిష్పాక్షిక విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలను బ్లాక్ మెయిల్ చేయడం, ఫిర్యాదు దారులను బెదిరించడం మానుకోవాలని ఆయన బాలినేనికి హితవు పలికారు. అసలే బాలినేని ఇబ్బందులో ఉంటే సరైన టైం చూసి జనసేన కార్పోరేటర్ సవాల్ చేశారు అని అంటున్నారు. దీనికి బాలినేని బదులు ఏమిస్తారు అన్నది ఆసక్తికరంగా అంతా చూస్తున్నారు.