పేద‌ల‌కు రాజ‌ధానిలో ఇళ్లు ఇస్తే…నొప్పి ఎందుకంటే?

రాజ‌ధాని అమ‌రావ‌తి అంద‌రిదీ కాదు, కేవ‌లం ధ‌న‌వంతుల‌దే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌ధాని అంటే పెద్ద‌పెద్ద ప్ర‌భుత్వ కార్యాల‌యాల భ‌వంతులు, ప‌రిశ్ర‌మ‌లే త‌ప్ప‌, పేద‌ల‌కు స్థానం లేద‌ని కొంద‌రు గ‌ట్టిగా వాదిస్తున్నారు. అంతేకాదు, రాజ‌ధానిలో…

రాజ‌ధాని అమ‌రావ‌తి అంద‌రిదీ కాదు, కేవ‌లం ధ‌న‌వంతుల‌దే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌ధాని అంటే పెద్ద‌పెద్ద ప్ర‌భుత్వ కార్యాల‌యాల భ‌వంతులు, ప‌రిశ్ర‌మ‌లే త‌ప్ప‌, పేద‌ల‌కు స్థానం లేద‌ని కొంద‌రు గ‌ట్టిగా వాదిస్తున్నారు. అంతేకాదు, రాజ‌ధానిలో దాదాపు 50 వేల మంది పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇస్తామంటే ఒప్పుకునే ప్ర‌శ్నే లేద‌ని వారు అంటున్నారు. అయితే ఇలాంటి వారి వాద‌న‌ల్ని, అడ్డంకుల‌ను ప‌ట్టించుకోకుండా ఏపీ స‌ర్కార్ ముందుకెళుతోంది.

ఈ క్ర‌మంలో న్యాయ‌పోరాటంలో ఏపీ స‌ర్కార్ విజ‌యం సాధించింది. ఈ నెల 15న పేద‌ల‌కు ఇంటి స్థ‌లాల ప‌ట్టాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం యుద్ధ‌ప్రాతిపదిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది. మ‌రోవైపు హైకోర్టు మొట్టిక్కాయ‌లు వేసినా, కొంత మందిలో మార్పు రాలేదు. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం. 1134.58 ఎక‌రాల్లో రాజ‌ధాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోని 48,379 మంది పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇస్తే… అడ్డుకునే వారికి క‌లిగిన నొప్పి ఏంట‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

పైసా ఖ‌ర్చు పెట్టకుండా రాజ‌ధానికి దాదాపు 50 వేల ఎక‌రాలు ఇచ్చి త్యాగం చేశార‌ని చంద్ర‌బాబునాయుడితో పాటు టీడీపీ నేత‌లు గొప్ప‌గా చెబుతుంటారు. కానీ త్యాగం అనే మాట‌కు అర్థ‌మే లేదు. ఎందుకంటే వాళ్లంతా భూమి ఇచ్చింది రాజ‌ధానికి అనుకోవ‌డం ఉత్తుత్తి మాట‌లే. రాజ‌ధాని పేరుతో నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర‌లేపింది. ఎక‌రా భూమి ఇస్తే… రూ.10 కోట్ల విలువైన భూమిని డెవ‌ల‌ప్‌మెంట్ చేసి, తిరిగి ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆచ‌ర‌ణ సాధ్యం కాని హామీలిచ్చింది.

నిజానికి అక్క‌డి వారిని భారీగా మోసం చేసింది చంద్ర‌బాబు, ఆయ‌న మ‌నుషులే. ప్ర‌భుత్వం మార‌డం, మూడు రాజ‌ధానుల అంశం తెర‌పైకి రావ‌డంతో అంతా త‌ల‌కిందులైంది. త్వ‌ర‌లో త‌మ చేతికి భారీ మొత్తం డ‌బ్బు వస్తుంద‌ని ఆశించిన వారి క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాజ‌ధాని అభివృద్ధిని ప‌క్క‌న ప‌డేసింది. ఇదే పెద్ద షాక్ అని అల్లాడుతున్న త‌రుణంలో, మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ చందంగా పేద‌ల‌కు ఇంటిస్థ‌లాలు ఇవ్వాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ శ‌ర‌వేగంగా పావులు క‌దుపుతోంది.

తాజాగా న్యాయ‌స్థానం కూడా పేద‌ల‌కు ఇంటి స్థ‌లాలు ఇచ్చేందుకు ప‌చ్చ జెండా ఊప‌డంతో రాజ‌ధానిలో భూములిచ్చిన వారి గోడు వ‌ర్ణ‌నాతీతం. పేద‌ల‌కు రాజ‌ధాని ప్రాంతంలో చోటు ద‌క్కితే, త‌మ భాగానికి వ‌చ్చే భూమికి మార్కెట్ విలువ పెర‌గ‌క‌పోగా, అమాంతం ప‌డిపోతుంద‌నేది వారి బాధ‌, ఆక్రోశం. ఒక‌వేళ రేపు మ‌ళ్లీ చంద్ర‌బాబే అధికారంలోకి వ‌చ్చి, తిరిగి అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ప్ర‌క‌టించినా, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ భూముల‌కు రేట్లు పెరిగే ప‌రిస్థితి వుండ‌దు.

ద‌ళితులు, గిరిజ‌నులు, ఇత‌ర వెనుక‌బ‌డిన కులాలుంటే భూములు కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రార‌నేది వారి అంత‌రంగం. ఆ విష‌యాన్ని ధైర్యంగా బ‌య‌ట‌కు చెప్ప‌లేక‌, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ విధ్వంసం చేసింద‌ని ఆక్రోశం వెళ్ల‌గ‌క్క‌లేక‌, స్థానికేత‌రుల‌కు ఇంటి పట్టాలు ఇవ్వ‌డం ఏంటంటూ వింత వాద‌న‌ను న్యాయ‌స్థానాల్లో వినిపిస్తుండ‌డం వారికే చెల్లింది. 

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పేద‌లు స్థానికేత‌రుల‌ని వ‌ద్దంటున్నవాళ్లు, మ‌రి దేశ‌విదేశాల్లోని ప‌రిశ్ర‌మ‌ల‌కు మాత్రం ఇవ్వాల‌ని కోరుకోవ‌డంలో మ‌త‌ల‌బు ఏంటో జ‌నానికి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. రాజ‌ధానిపై ప్రేమ ఎంత మాత్రం కాదు. కేవ‌లం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుప్ప‌కూల్చి, భ‌విష్య‌త్‌లో కూడా కోలుకోలేని విధంగా అల‌గా జ‌నాన్ని జ‌గ‌న్ తీసుకొచ్చి త‌మ నెత్తిన రుద్దార‌నేది వారి ఆవేద‌న‌. ఇక ఎప్ప‌టికీ  అత్యాశ‌కు త‌గ్గ‌ట్టు రాజ‌ధాని ప్రాంతంలో భూముల రేట్లు పెర‌గ‌వ‌ని వారి గ‌గ్గోలే నిలువెత్తు నిద‌ర్శ‌నం.