టైటిల్: మామా మశ్చీంద్ర
రేటింగ్: 1/5
తారాగణం: సుధీర్ బాబు, ఈషా రెబ్బ, మృణాళిని రవి, హర్ష వర్ధన్, ఆలి రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
కెమెరా: పీజీ విందా
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాతలు: సునీల్ నారంగ్, రాం మోహన్ రావు
రచన-దర్శకత్వం: హర్షవర్ధన్
విడుదల తేదీ: 6 అక్టోబర్ 2023
సుధీర్ బాబు త్రిపాత్రాభినయం ఒక కొత్తదనమైతే, అమృతం ఫేం హర్షవర్ధన్ రచన-దర్శకత్వం ఆసక్తికరమైన అంశం. ఈ కారణాల చేత ఈ చిత్రంపై కాస్త ఫోకస్ పడింది.
పరశురాం (సుధీర్ బాబు) బాల్యంలో చాలా బాధలు పడతాడు. తన తల్లిని తండ్రే చంపేస్తాడు. ఈ పరశురాం కి ఒక సవతి చెల్లెలుంటుంది. ఆమెకి ఇద్దరు కవలలుంటారు. భవిష్యత్తులో వాళ్లు తన ఆస్తిని అడుగుతారని లైన్ క్లియర్ చేసుకోవడానికి తన ఫ్రెండ్ దాసు (హర్షవర్ధన్) కి చెప్పి వాళ్లందరినీ చంపేయమంటాడు పరశురాం. కానీ ప్లాన్ ఫెయిలయ్యి వాళ్లెవ్వరూ చావరు. కానీ చెల్లా చెదురైపోతారు.
ఇదిలా ఉంటే ఏవో లెక్కలేసుకుని దాసు తనకి పుట్టిన కూతుర్ని పరశురాం కి పుట్టిన కూతుర్ని ఆసుపత్రిలోనే తారుమారు చేస్తాడు. ఇది తెలియని పరశురాం కూడా వేరే లెక్కలేసుకుని తనకి పుట్టిన కూతుర్ని దాసుకి పుట్టిన కూతుర్ని తారుమారు చేస్తాడు. అంటే ఎవరి కూతురు వారి దగ్గరికే చేరిందన్నమాట. అదంతా గతం.
ఇక ప్రస్తుతానికి వస్తే పరశురాం కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బ) దుర్గ (సుధీర్ బాబు) అనే ఒక వైజాగ్ కుర్రాడిని ప్రేమిస్తుంది. దాసు కూతురు మీనాక్షి (మృణాళిని) డీజె (సుధీర్ బాబు) ని ప్రేమిస్తుంది. ఇంతకీ తప్పిపోయిన కవలలు ఎవరు? వీళ్లేనా? ఎవరు ఎవర్ని ప్రేమించి చివరికి ఎవర్ని పెళ్లి చేసుకుంటారు? పరశురాం మర్డర్ ప్లాన్ తర్వాతనైనా ఫలించిందా? ఇదీ కథ.
ప్రతి సినిమా ఒక జానర్లో ఉంటుంది. ఇది ఏ జానరో చెప్పమని పోటీ పెట్టొచ్చు. ఈ గజిబిజి గందరగోళ కథని అర్ధం చేసుకోవడానికి మెదడుకి చాలా పదునుండాలి. ఎవరు ఎవరి కూతురు, ఏ సుధీర్ బాబుది ఏ బ్యాక్ గ్రౌండ్? అసలు తెర మీద ఏం జరుగుతోంది? కథకి గమనం సరే..గమ్యం ఎక్కడ? ఇలాంటి ప్రశ్నలన్నీ తలలో తిరుగుతుండగా ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.
ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఏమీ మార్పుండదు. పరశురాం సానుభూతి పాత్రతో పరిచయమయ్యి క్రమంగా విలనవుతాడు. అంతలోనే ఫూల్ అయ్యి కమెడియన్ టైపులో కనిపిస్తాడు. ఈ లోగా మంచి తండ్రిగా కనిపించి, ఆ తర్వాత తన దుర్మార్గపు కోణాన్ని బయటపెట్టి చివరికి మరొక యాంగిల్ చూపిస్తాడు. ఎస్, ఇదంతా ఒక్క పరశురాం పాత్ర గ్రాఫ్ మాత్రమే.
అలాగే డీజె, దుర్గ పాత్రల్లో కనిపించిన సుధీర్ బాబు ఇంకొన్ని యాంగిల్స్ చూపిస్తాడు.
మూడు డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించడం తప్పితే అసలు తాను పొషించిన పాత్రల విషయంలో సుధీర్ బాబుకైనా క్లారిటీ ఉండుంటుందా అనే డౌటొస్తుంది.
చిత్ర విచిత్రమైన రచనా విన్యాసం చూపించి “అమృతం” హర్షవర్ధన్ మెదడుకి మసాజ్ చేసేసాడు. రెండున్నర గంటల సినిమాయే అయినా రెండున్నరేళ్ల డైలీ సీరియల్ ని కట్టేసి చూపించిన ఫీలింగొస్తుంది.
హర్షవర్ధన్ చాలా టాలెంట్ ఉన్న రచయిత. “మనం” లాంటి సినిమాలో అతని సంభాషణలు ఒక రేంజ్. కానీ ఇక్కడ ఆ స్పార్క్ లేదు. చాలా కాంప్లికేటెడ్ కథని రాసుకుని గందరగోళపరిచాడా, లేక గందరగోళంగా ఉంది కాబట్టి కాంప్లికేటెడ్ కథలా అనిపిస్తోందా అనేది అతనే ప్రశ్నించుకోవాలి.
మధ్యలో షకలక శంకర్ ని ఆర్జీవీ పాత్రలో చూపించి నవ్వించే ప్రయత్నం చేసాడు. కానీ అసలా ట్రాక్ మొత్తం విసుగొస్తుంది. ఆర్జీవీని చూడగానే దుర్గ పాత్రలో ఉన్న సుధీర్ బాబు అతనికి గన్స్ ఇచ్చి “ఇవిగో గన్స్” అంటాడు. విశాలక్షిగా కనిపించిన ఈషా రెబ్బా నడుముకి కట్టుకున్నదేదో విప్పవతల పారేసి “ఇవిగో థైస్” అంటూ చూపిస్తుంది. ఆ తర్వాత ఒక పాట. ఆర్జీవీ పాత్రధారుడు ఈషా రెబ్బాతో స్టెప్పులు. ఇంత సెటప్ చేసుకుని ఆర్జీవీ డూప్ షకలక శంకర్ దేనికో! అడిగుంటే ఒరిజినల్ ఆర్జీవీయే నటించేవాడేమో! పబ్లిసిటీ అన్నా దక్కేది.
ఈ రోజుల్లో డైరీలు రాసుకునే పాత్రలు, ఆ డైరీల చుట్టూ తిరిగే కథనం ఎంత ఔట్ డేటెడ్ ఆలోచనో అనిపిస్తుంది.
మృణాళిని రవి, ఈషా రెబ్బ చూడ్డానికి తప్ప చెయ్యడానికి వాళ్ల పాత్రలేవీ గొప్పగా మలచబడలేదు.
హర్షవర్ధన్ పాత్ర పాజిటివ్ గా సాగుతుంది.
ఆలి రెజా చివర్లో కాసేపు కనిపించాడు.
రాజీవ్ కనకాల రెండు మూడు సీన్స్ లో కనిపించాడు.
హరితేజకి క్లైమాక్స్ ముందు ఒక డైలాగ్ సీనుంది.
అజయ్ ఫస్టాఫులో ద్విపాత్రాభినయంలో కనిపించాడు. నాలుగు డైలాగులు చెప్పాడు. రచయితకి ఇన్నేసి పాత్రలకి డైలాగ్స్ రాసి అలసటొచ్చిందో ఏమో..సెకండాఫులో అజయ్ పాత్రకి మతి పోగొట్టేసి డైలాగ్స్ రాయకుండా తప్పించుకున్నాడు.
కథనం వంకరపోతే సినిమా అనే దేహంలో ఏదీ అందంగా కనిపించదు, ఇంపుగా వినిపించదు. ఆరెక్స్ 100 లాంటి సినిమాతో పేరు తెచ్చుకున్న చైతన్ భరద్వాజ్ అత్యంత పేలవమైన మ్యూజిక్ అందించాడు. ఒక్కపాట కూడా అటెన్షన్ పుల్లింగ్ గా లేదు. తను ఇవ్వాలనుకున్నదే ఇచ్చాడా లేక దర్శకుడి టేస్టే ఇదా అనేది తెలీదు.
ఒక పాటలో మాత్రం, “అయ్య బాబోయ్ ఏవిటో చెప్పలేను అర్ధమయ్యి అవ్వనట్టుగా ఉందే” అంటూ ఒక లైనొస్తుంది. ఈ సినిమా చూసే దాదాపు ప్రతి ప్రేక్షకుడి పరిస్థితి అదే.
ప్రారంభ దశలో పదిహేను నిమిషాలు మినహాయిస్తే ఆ తర్వాత నుంచి చివరి వరకు సహన పరీక్ష చేసే సినిమా ఇది. నేపథ్య సంగీతం కూడా చాలా బ్యాడ్ అవడంతో కూర్చోవడమే ఇబ్బందనిపిస్తుంది.
తెగిన గాలిపటంలాంటి కథనం ఎప్పుడు ఎక్కడ పడుతుందో చూడ్డమే తప్ప ప్రేక్షకులకి హుక్ అనేదే లేదు. “మామా మశ్చీంద్ర” ఎలా ఉందిరా అంటే “మామా! చచ్చాన్రా” అని బదులిచ్చేలా ఉంది.
బాటం లైన్: మామా! చచ్చాన్రా