ఈ మాట అంటోంది ఎవరో కాదు, దర్శకుడు మారుతి. కోపం, కసితో సినిమా తీసిన ప్రతిసారి హిట్ కొట్టానంటున్నాడు ఈ డైరక్టర్. ఎవరైనా తనపై విమర్శలు చేస్తే కోపమొస్తుందని, ఆ కోపం నుంచి మంచి కథలు పుడతాయని అంటున్నాడు.
“విమర్శలన్నీ నాకు గురువులుగా మారాయి. నన్ను నేను మార్చుకోవడానికి బాగా ఉపయోగపడ్డాయి. నేను ఆ టైపు దర్శకుడ్ని కాదని నిరూపించుకోవడానికి ప్రేమకథాచిత్రమ్ తీశాను. అయినప్పటికీ కొంతమంది అదే పనిగా రుద్దుతంటే, కసితో భలేభలే మగాడివోయ్ తీశాను. నన్ను విమర్శించేకొద్దీ ఇంకా స్ట్రాంగ్ అయిపోతాను. నాకు చేతకాదు, చేయలేను అని ఎవరైనా అంటే నాకు చాలా కోపం వస్తుంది. ఆ కోపం నుంచి మంచి కథలొస్తాయి. నాకు కోపం రావాలి, కోపం రాకపోతే మంచి సినిమాలు తీయలేను. నువ్వు తీయలేవు అని ఎవరైనా అంటే కచ్చితంగా హిట్ కొడతా. నేను కసితో, కోపంతో తీసిన సినిమా కచ్చితంగా హిట్టయింది.”
ఇలా తన బలాన్ని బయటపెట్టాడు మారుతి. గ్రేట్ ఆంధ్రతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడిన ఈ దర్శకుడు.. ప్రభాస్ తో చేస్తున్న సినిమాపై కూడా స్పందించాడు. అంతేకాదు.. తనపై జరిగిన ట్రోలింగ్ వల్ల, రెట్టించిన కసితో ఆ సినిమా చేస్తున్నట్టు తెలిపాడు.
“ప్రభాస్ తో సినిమా అని ప్రకటించినప్పుడు సోషల్ మీడియాలో నాపై విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. అంతా కలిసి నాకు కావాల్సినంత కోపం ఇచ్చారు. వీడు చేయలేడు అని కామెంట్ చేసిన ప్రతిసారి కోపంతో కూడిన ఎనర్జీ వచ్చింది. ప్రభాస్ కూడా 'డార్లింగ్ నీకు కోపం రావాలి' అంటారు. నేను చేయలేను అంటూ కొంతమంది సవాల్ విసిరారు. ప్రభాస్ సినిమాతో కొట్టి చూపిస్తున్నాను.”
ప్రభాస్ తో చేస్తున్న సినిమా జానర్, కథ, టైటిల్ పై ఎలాంటి లీకులు ఇవ్వలేదు మారుతి. అయితే సినిమా మాత్రం తన మార్క్ లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. సినిమాలో వందశాతం ఫన్ గ్యారెంటీ అని స్పష్టం చేశాడు.