పొలిటిక‌ల్ గేమ్‌…ఇంకా ఎన్నాళ్లు సార్‌?

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి పొలిటిక‌ల్ గేమ్ కొన‌సాగుతోంది. ఇది ఇంకా ఎన్నాళ్లు అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ త‌ర‌పున ఖ‌మ్మం నుంచి 2014లో ఎంపీగా గెలుపొందారు. ఆ త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2019లో…

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి పొలిటిక‌ల్ గేమ్ కొన‌సాగుతోంది. ఇది ఇంకా ఎన్నాళ్లు అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ త‌ర‌పున ఖ‌మ్మం నుంచి 2014లో ఎంపీగా గెలుపొందారు. ఆ త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2019లో ఖ‌మ్మం నుంచి ఎంపీ టికెట్ ద‌క్క‌క‌పోయినా అదే పార్టీలో అయిష్టంగా కొన‌సాగారు. తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న బీఆర్ఎస్ నుంచి బ‌య‌టికెళ్లారు.

ఏ పార్టీలోకి వెళ్లాల‌నే దానిపై పొంగులేటి ఎటూ తేల్చుకోలేక‌పోతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, వైఎస్సార్‌టీపీ అంటూ రోజుకో పార్టీలో ఆయ‌న చేరుతార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. రెండు రోజుల‌క్రితం బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్‌తో పొంగులేటి భేటీ కావ‌డంతో ఇక ఆ పార్టీలో చేరుతార‌ని అంతా అనుకున్నారు. మ‌ళ్లీ ఆయ‌న ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీలో చేరిక‌పై ఇంకా ఆయ‌న స్ప‌ష్టత ఇవ్వ‌లేదు.

బీజేపీలో చేర‌డానికి ఇంకా ఏవో అడ్డంకులు ఆయ‌న‌కు ఉన్న‌ట్టున్నాయి. ముఖ్యంగా ఖ‌మ్మం జిల్లా వామ‌ప‌క్ష పార్టీల ప్ర‌భావిత ప్రాంతం. అలాంటి చోట బీజేపీని ఆద‌రించ‌ర‌నే భ‌యం పొంగులేటిని వెంటాడుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో బీజేపీలో చేర‌డానికి పొంగులేటి ముందూవెనుకా ఆలోచిస్తున్నారు. మ‌రోవైపు సొంత పార్టీ వైపు అడుగులు వేస్తున్నార‌ని కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో సొంత పార్టీ పెట్టి నెట్టుకు రావ‌డం అయ్యే ప‌నికాద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పారిశ్రామిక‌వేత్త అయిన పొంగులేటి వ‌ద్ద ఆర్థిక వ‌న‌రులు ఉన్న‌ప్ప‌టికీ, అవే ఓట్లు రాల్చ‌వ‌ని చెబుతున్నారు. 

ఖ‌మ్మంతో పాటు న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లో పొంగులేటికి చెప్పుకోత‌గ్గ ప‌రిచ‌యాలే ఉన్నాయి. త‌న‌తో పాటు త‌న వ‌ర్గానికి కూడా త‌గిన ప్రాధాన్యం ఇస్తే బీజేపీలోకి వెళ్ల‌డ‌మా? లేక సొంత పార్టీని స్థాపించి ఇష్ట‌మొచ్చిన‌ట్టు న‌డుచుకోవ‌డ‌మా? అనే విష‌య‌మై పొంగులేటి తేల్చుకోలేక‌పోతున్నారు. 

ఇక అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కూడా పెద్ద‌గా స‌మ‌యం లేక‌పోవ‌డంతో ఏదో ఒక‌టి తేల్చుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని పొంగులేటి అనుచ‌రులు ఆయ‌న‌పై ఒత్తిడి చేస్తున్నార‌ని తెలిసింది. మ‌రి పొంగులేటి పొలిటిక‌ల్ గేమ్‌కు ఎప్పుడు ముగింపు ప‌లుకుతారో చూడాలి.