కొత్త కూటమికి ‘దక్షిణాది ప్రధాని’ డిమాండ్!

నరేంద్రమోడీకి వ్యతిరేకంగా దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలన్నీ జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమీకరణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇది కొత్త ప్రయత్నం కాదు. కేసీఆర్ కు…

నరేంద్రమోడీకి వ్యతిరేకంగా దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలన్నీ జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమీకరణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇది కొత్త ప్రయత్నం కాదు. కేసీఆర్ కు ఈ ముచ్చట కూడా కొత్తది కాదుద. ఆయన రెండో దఫా ముఖ్యమంత్రి అయిన తొలినాటినుంచి కూడా ఆయన మోడీ వ్యతిరేక కూటమిని రూపుదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

అయితే కేసీఆర్ లోని చిత్తశుద్ధిని.. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలు ఒక పట్టాన నమ్మకపోవడమే ప్రతిసారీ ఈ కూటమి ముందడుగు పడడంలో ప్రతిబంధకం అవుతోంది. ఏది ఏమైనప్పటికీ.. ఇప్పుడు మళ్లీ మూడో కూటమి వ్యవహారం ముమ్మరంగా చర్చల్లోకి వస్తోంది. మోడీని తీవ్రంగా వ్యతిరేకించి కీలకమైన నాయకులు.. మమతా బెనర్జీ ,కేసీఆర్, స్టాలిన్ లు ఫోన్లలో సంభాషణలు కూడా జరుపుతున్నారు. వీరంతా కలిసి కూటమికి ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తున్నారు. 

అంతా బాగానే ఉంది. అయితే మూడో కూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి  అయ్యేదెవరు. ఎవరి ఛరిష్మాను తెరమీద చూపించి.. దేశవ్యాప్తంగా ఓట్లు రాబట్టాలి. మోడీని మరపించేలా లేదా మోడీని ఛీకొట్టేలా మంచి పాలన అందించబోయేది ఎవరు? అని ఈ కూటమి ప్రజలకు చెబుతుంది? అనేది కూడా చాలా కీలకమైన అంశం. 

మూడో కూటమి తరఫున ప్రధాని ఎవరు అనేది తేలాలి? అయితే అసలు కూటమి అంటూ సాధ్యమైతే గనుక.. దక్షిణాది రాష్ట్రాలనుంచే ప్రధాని ఉండాలనే డిమాండ్ కూడా రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరంగా వినిపిస్తోంది. కేసీఆర్ కు కూడా ఆ ముచ్చట ఉంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రి లాగా ఆయన ప్రొజెక్టు చేస్తుండగా.. ఆయన దేశ ప్రధాని కావాలనుకుంటున్నారంటూ.. అనేక పుకార్లు చాలా కాలంగా షికారు చేస్తూనే ఉన్నాయి. 

అయితే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్న ప్రకారం.. మూడో కూటమి గద్దెమీదికి వచ్చినా.. ఆ కూటమిలో కేసీఆర్ ఎంత కీలకంగా వ్యవహరించినా సరే.. కేసీఆర్ ప్రధాని కావడం మాత్రం అసాధ్యం అనే అంటున్నారు. ఎందుకంటే.. ఈ కూటమిలో వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, తమిళనాడు నుంచి స్టాలిన్ కూడా ఎంతో కీలకంగానే ఉండబోతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వారు బలమైన నాయకులు. తెలంగాణ లో కేసీఆర్ కు ఉన్న బలం కంటె, తమ తమ రాష్ట్రాల్లో వారికి ఉన్న బలం ఎక్కువ. పైగా లోక్ సభలో సభ్యుల సంఖ్యాపరంగా కూడా ఆ రెండూ తెలంగాణ కంటె చాలా పెద్ద రాష్ట్రాలు. 

కేవలం 17 మంది ఎంపీ సీట్లున్న తెలంగాణలో కేసీఆర్ గెలవగలిగే సీట్లు ఎన్ని ఉంటాయి? ఎన్ని గెలిచినా ఆయన మూడో కూటమిలో ఒక చిన్న భాగస్వామి అవుతారు. అదే సమయంలో 42 సీట్లున్న వెస్ట్ బెంగాల్ నుంచి మమత ఎన్ని గెలుస్తారు. 39 సీట్లున్న తమిళనాడు నుంచి స్టాలిన్ ఎన్ని గెలుస్తారో కూడా చూడాలి. వారిద్దరి బలాబలాలు ఇంచుమించు సమానంగా ఉండేట్లయితే గనుక.. దక్షిణాది ప్రధానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ మరింతగా ఊపందుకుంటుంది. 

ఉత్తరాది నాయకులు ప్రధానులు అయిన ప్రతి సందర్భంలోనూ దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురయ్యాయనే ఆరోపణలు చాలా విస్తృతంగానే వినిపించాయి. ఇప్పుడు మూడో కూటమి రూపంలో.. దక్షిణాది ప్రధానికి అవకాశం వస్తుందేమో చూడాలి.