ఏపీ పోలీసు బాస్ గా గౌతం సవాంగ్ ఉన్న రోజుల్లోనే తెలుగుదేశం వర్గాలు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రతిపక్ష పార్టీలు తమ ప్రాథమికమైన డ్యూటీలాగా భావిస్తాయి గానీ.. సవాంగ్ డీజీపీగా ఉండగా.. అలాంటి ఆటల్లో అతి చేసినప్పుడెల్లా ఎదురుదెబ్బలు తగిలాయి.
ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం విషం చిమ్మడానికి ప్రయత్నించిన అనేకమంది కటకటాలు లెక్క పెట్టారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, పోరాటాల పేరుతో రాజకీయ డ్రామాలు నడిపించడానికి ప్రయత్నించిన వారు కూడా అనేకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసు ఆంక్షలు వారికి చాలా చేదుగా, కఠినంగా అనిపించాయి. అలాంటి వారందరూ కూడా ఇప్పుడు రాష్ట్రంలో పోలీసు బాస్ మార్పిడితో మరింతగా బెంబేలెత్తుతున్నారు.
కానీ టీడీపీ వాళ్లు తెలుసుకోవల్సింది ఒకటుంది. పోలీసు బాస్ గా ఎవరున్నారనేది ప్రయారిటీ ఎన్నడూ కానేకాదు. తమ ఓవరాక్షన్ తగ్గించుకోవడం వారు మానుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నారు గనుక.. ప్రభుత్వ పనితీరులోని లోపాల గురించి నిర్మాణాత్మక, క్రియాశీలమైన విమర్శలు ఎన్ని చేసినా పర్లేదు. అలా కాకుండా విషం చిమ్మడానికి, బురద చల్లడానికి ప్రయత్నిస్తేనే తకరారు. మసిగుడ్డ కాల్చి మొహాన పారేస్తం.. మీరే కడుక్కోండి తరహా దుర్మార్గపు ప్రచారాలకు తెగబడితే.. వారికి ఎప్పటికైనా పరాభవం తప్పదు.
అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యతిరేక నిరసన దీక్షలు చేయడానికి విశాఖ వెళ్లిన సందర్భంలోనూ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా.. తెలుగుదేశం కార్యకర్తల ‘అతి’ వ్యవహారాలకు పోలీసులు ముకుతాడు వేసినా.. చంద్రబాబునాయుడు , డీజీపీ గౌతం సవాంగ్ మీద విరుచుకుపడిపోతుండేవారు. ఎక్కడ ఏ గొడవ జరిగినా.. చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసే తప్పుడు పనులు, నేరాల మీద చర్యలు తీసుకున్నా కూడా చంద్రబాబునాయుడు నోరేసుకుని పడిపోయేవారు. ట్విటర్లో ఎడాపెడా ట్వీటేవారు. కలం పుచ్చుకుని.. ఓ లేఖాస్త్రాన్ని సంధించి.. దానిని గౌతం సవాంగ్ మీదికి ప్రయోగిస్తూ ఉండేవారు.
మరో రకంగా చూసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ దళాలు సాగించే విషప్రచారాలను అడ్డుకోవడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా.. కట్టడి చేసినా.. అలాంటి ప్రచారాలు యథేచ్ఛగా పచ్చ సోషల్ మీడియా వేదికల మీద సాగుతూనే వచ్చాయి. మొత్తానికి గౌతం సవాంగ్ బదిలీ అయ్యారు.
ఇప్పుడు తెలుగుదేశం దళాలు భయపడుతున్నది కూడా అదే. తమను కట్టడి చేయడానికి ఎంతో ప్రయత్నించినా. గౌతం సవాంగ్ మీదనే సీఎం జగన్ వేటు వేసేశారు. మరి కొత్తగా వచ్చే పోలీసు బాస్ అంతకంటె కఠినంగానే వ్యవహరిస్తాడు కదా! ఇలాంటి విషప్రచారాల విషయంలో ఏ మాత్రం తోక జాడించినా కత్తింరించేస్తారేమో అనే భయం తెలుగుదేశం వర్గాలను వెన్నాడుతోంది.