మాటే మంత్రమంటారు. మాటకున్న పవర్ అలాంటిది మరి. టాలీవుడ్‌లో అనేక మంది నటులున్నారు. అయితే వారిలో మోహన్‌బాబుకు ఓ ప్రత్యేకత ఉంది. మోహన్‌బాబు సినిమా అంటే డైలాగ్‌లకు పెట్టింది పేరు.
డైలాగ్ డెలవరీలో ఆయన తర్వాతే మరెవరైనా. హీరో లేదా విలన్ …పాత్ర ఏదైనా సమయోచితంగా డైలాగ్ చెప్పడంతో పాటు అందుకు తగ్గ అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే మోహన్‌బాబుకు డైలాగ్ కింగ్ అనే బిరుదు తీసుకొచ్చింది. ప్రేక్షకులు ఇచ్చే బిరుదు కంటే ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఉండవు.
మోహన్‌బాబు డైలాగ్ డెలవరీలో ఎంత లబ్ధి ప్రతిష్టుడంటే స్వయంగా ఆయన కుమారుడు, హీరో మంచు విష్ణునే అసూయ పడేంత. డైలాగ్ కింగ్ మోహన్‌బాబు గత నెల నవంబర్‌లో 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు విష్ణు తన తండ్రి పవర్‌పుల్ డైలాగ్‌ను అభిమానులతో పంచుకున్నారు.
మోహన్‌బాబు నటించి మెప్పించిన సినిమాల్లో తనకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటో ట్విటర్ వేదికగా విష్ణు వెల్లడించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు నటించిన ‘అడవిలో అన్న’ చిత్రంలోని పాపులర్ సన్నివేశాన్ని విష్ణు తెరమీదకి తెచ్చారు.
‘ఆయన నటించిన సినిమాల్లో నాకు ఇష్టమైన సినిమా, డైలాగుల్లో ఇది ఒకటి. ఈ సినిమాలో ఆయన డైలాగ్ చెప్పే విధానం, ఆయన మ్యానరీజం చూసినప్పుడల్లా నాకు అసూయగా ఉంటుంది’ అని విష్ణు ట్వీట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక నటుడు 45 ఏళ్ల పాటు సినిమాల్లో రాణించడం అంటే చిన్న విషయం కాదు. మోహన్‌బాబు నటనలో వైవిధ్యం, డైలాగ్ చెప్పడంలో ఆకర్షించే గుణం ఉండడం వల్లే నాలుగు దశాబ్దాలకు పైబడి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కొడుకు అసూయ పడేంతగా డైలాగ్ చెప్పారంటే, అంతకంటే ఏ తండ్రికైనా ప్రశంస ఏముంటుంది?