సిల్వర్ స్క్రీన్ పై కీర్తిసురేష్ కు ఎంత క్రేజ్ ఉందో.. బుల్లితెరపై కూడా ఆమెకు అదే స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈసారి ఆ మేజిక్ పనిచేయలేదు. కీర్తిసురేష్ నటించిన ఓ సినిమా స్మాల్ స్క్రీన్ పై కూడా ఫ్లాప్ అయింది.
కీర్తిసురేష్ నటించిన పెంగ్విన్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. క్రిటిక్స్ మెప్పు కూడా పొందలేదు. అలా స్ట్రీమింగ్ కొచ్చిన కొన్ని రోజులకే దుకాణం సర్దేసిన ఈ సినిమాను ఏరికోరి మరీ కొనుక్కొంది జీ తెలుగు ఛానెల్.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా గతనెల 29న తేదీన ఈ సినిమాను ప్రసారం చేసింది. ఈ మూవీకి కేవలం 3.64 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఈ సినిమా కంటే, మళ్లీ మళ్లీ ప్రసారం చేసిన ప్రతిరోజూ పండగే, రేసుగుర్రం లాంటి సినిమాలకు మంచి రేటింగ్స్ వచ్చాయి.
అలా కీర్తిసురేష్ కు పెంగ్విన్ సినిమా ఏ కోణంలోనూ కలిసిరాలేదు. నిజానికి ఈ సినిమాతో ఆమె విమర్శకుల ప్రశంసలు ఆశించింది. ఆ ముచ్చట కూడా నెరవేరలేదు. మరో దెబ్బ ఏంటంటే.. దీని తర్వాత ఆమె చేసిన మిస్ ఇండియా కూడా తుస్సుమంది. త్వరలోనే బుల్లితెరపైకి రాబోతున్న ఆ సినిమానైనా కీర్తికి కలిసొస్తుందేమో చూడాలి.