అసలే సినిమా బడ్జెట్ చేతులు దాటింది. దీంతో ప్రాజెక్టు కూడా చేతులు మారింది. దీనికితోడు లాక్ డౌన్ ప్రభావం ఉండనే ఉంది. ఇలాంటి టైమ్ లో నిర్మాత కోసం నాని ఓ అడుగు ముందుకేశాడు. ఎన్ని రోజులు కావాలంటే అన్నిరోజులు ఏకథాటిగా షూటింగ్ చేసుకోమని, బల్క్ గా డేట్స్ ఇచ్చేశాడు.
ఇదంతా శ్యామ్ సింగరాయ్ వ్యవహారం. ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమా. సితార వాళ్లు చేయాల్సిన ఈ సినిమా నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ చేతికొచ్చింది. కేవలం బడ్జెట్ ఎక్కువైందనే రీజన్ తోనే ప్రాజెక్టు ఇలా చేతులు మారిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు దీనికి కాంపన్సేషన్ గా బల్క్ లో డేట్స్ ఇచ్చాడు నాని. ఎంత వీలైతే అంత తొందరగా సినిమా పూర్తిచేయమని హామీ ఇచ్చాడు. అటు కొత్త హీరోయిన్ కృతి షెట్టి కాల్షీట్లు కూడా బల్క్ లో దొరికాయి. ఎటొచ్చి సాయిపల్లవితోనే చిక్కొచ్చి పడింది.
ప్రస్తుతం 2-3 సినిమాలు చేస్తున్న ఈ చిన్నది.. కాస్త కోపరేట్ చేస్తే శ్యామ్ సింగరాయ్ సినిమా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసుకొని ఒడ్డున పడుతుంది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు.
ఈనెల 21 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది. నెక్ట్స్ షెడ్యూల్ ను కోల్ కతాలో ప్లాన్ చేశారు. మేజర్ పార్ట్ షూటింగ్ కోల్ కతాలోనే పూర్తిచేయబోతున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.