రాను రాను డిజిటల్ స్ట్రీమింగ్ అన్నది కొత్త పుంతలు తొక్కుతోంది. కరోనా నేపథ్యంలో ఎంటర్ టైన్ మెంట్ అన్నది జనాల మొబైళ్లకు పూర్తిగా చేరువ అవుతోంది. బాలీవుడ్ లో పే ఫర్ వ్యూ, ఆన్ డిమాండ్ మూవీస్, ఎనీ టైమ్ మూవీ అనే కాన్సెప్ట్ లు బాగానే క్లిక్ అయ్యాయి.
కానీ తెలుగునాట ఇంకా అంత ఊపు అందుకోలేదు. అమెజాన్ కు చాలా వరకు అలవాటు పడ్డారు. హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లు ఇప్పుడిప్పుడే తెలుగు జనాలకు కూడా అలవాటు అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఏడాదికి ఒకేసారి మెంబర్ షిప్ తీసుకునేవి.
అలా కాకుండా సినిమాకు యాభై రూపాయలు లేదా వంద రూపాయల టికెట్ పెట్టి, థియేటర్ కు వెళ్లి టికెట్ తీసుకున్నట్లే, మన పక్కనే వున్న పాన్ బడ్డీలో టికెట్ తీసుకుని, మన మొబైల్ లో సినిమా చూసే కాన్సెప్ట్ తో వస్తోంది. ఎఫ్ ఎమ్ ఎటిటి. ఎఫ్ ఎమ్ అంటే ఫ్రైడే మూవీస్ అన్నది ఫుల్ ఫామ్.
ఈ ఎఫ్ ఎమ్ యాప్ ను అండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఫోన్ లో రెడీగా వుంచుకోవాలి. యాప్ లో ఏ సినిమా అన్నా చూడాలంటే దాన్ని క్లిక్ చేస్తే గూగుల్ పే, ఫోన్ పే, పెటిఎమ్ లాంటి ఆప్షన్లు వస్తాయి. వాటి ద్వారా పే చేసి వెంటనే సినిమా చూసుకోవచ్చు. 24 గంటలు సమయం వుంటుంది కాబట్టి పాజ్ చేసి కూడా చేసుకోవచ్చు.
సినిమారంగంతో సన్నిహిత స్నేహ సంబంధాలున్న విజయ్ మద్దూరి, వంశీ కారుమంచి కలిసి ఈ ఎఫ్. ఎమ్ ఎటిటి ని ప్రారంభిస్తున్నారు. బన్నీవాస్, కేదార్ లాంటి వాళ్లు మద్దతు అందిస్తున్నారు. మరో అయిదేళ్ల తరువాత థియేటర్ అన్నది ఎక్కువగా మొబైల్ కే పరిమితం అవుతుందనే ఆలోచనతో, ముందు చూపుతో ఈ ఎటిటిని ప్రారంభిస్తున్నారు.
థియేటర్ కు వెళ్లడం, టికెట్ తీసుకోవడం, రాను పోను ఖర్చులు, మిగిలిన ఖర్చులు లేకుండా ఇంట్లోనే సింపుల్ గా తమ కన్వీనియెంట్ టైమ్ లో సినిమా చూసే అవకాశం ఇది అని అంటున్నారు.
అయితే కేవలం ఎటిటి లో సినిమా వేసేయడం, వస్తే రావడం లేకుంటే లేదు అంటూ నిర్మాతలను గాలికి వదిలేయడం కాకుండా తాము సినిమాలను కొని, వాటిని థియేటర్, శాటిలైట్, డిజిటల్, ఇలా అన్న విధాలుగా మార్కెట్ చేసి, నిర్మాతలకు లాభం అందేలా అన్ని విధాలా ప్లాన్ చేస్తున్నామన్నారు.
ఇందుకోసం ఆయా రంగాల్లో వున్న సినిమా ప్రముఖులతో సహాయ సహకారాలు అందేలా చూసుకుంటున్నామన్నారు. ఈ నెల 18న డర్టీ హరి సినిమాతో ఎఫ్ ఎమ్ ఏటిటి ప్రారంభం అవుతుందని విజయ్-వంశీ, కేదార్ తెలిపారు.