అద్భుతమైన సక్సెస్ లు చవిచూసిన నిర్మాత ఎమ్ఎస్ రాజు. మహేష్, ప్రభాస్, వెంకటేష్, రామ్, సిద్దార్థ వంటి ఫామ్ లో వున్న హీరోలు అందరికీ మాంచి హిట్ లు ఇచ్చిన నిర్మాత.
ప్రస్తుత పోటీ కాలంతో కాస్త వెనుకబడ్డారు. దానికి తోడు పౌర్ణమి లాంటి మంచి సినిమా తీసినా కమర్షియల్ గా వర్కవుట్ కాక భారీ సినిమాలకు దూరం అయ్యారు.
ఇన్నాళ్ల తరువాత ఆయన తన స్వీయ దర్శకత్వంలో ఓ చిన్న సినిమా చేస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో తయారు చేసిన 'డర్టీ హరి' అనే ఈ సినిమా విడుదల సందర్బంగా ఆయన గ్రేట్ ఆంధ్రతో కాస్సేపు ముచ్చటించారు.
ఈ జనరేషన్ కు నచ్చే విధంగా, వారు మెచ్చే అంశాలు అన్నీ మిళితం చేసి తయారు చేసిన సినిమా డర్టీ హరి అని ఆయన వివరించారు. కేవలం సెక్స్ రొమాన్స్ తొ కూడిన సినిమా కాదని, మంచి కథ, కథనాలు, అండర్ కరెంట్ మెసేజ్ వుంటుందని, ఆద్యంతం ఆసక్తిగా చూడగలిగేలా ఈ సినిమాను రూపొందించానని అన్నారు.
పాత్రలకు సరిపడా నటులను తీసుకున్నానని, ఈ సినిమాలో చేసిన హీరో హీరోయిన్లు ఇద్దరికీ మంచి పేరు, అవకాశాలు రెండూ వస్తాయని ఆయన అన్నారు.
తన సినిమాల్లో చేసి టాప్ పొజిషన్ కు వెళ్లిన హీరోలు అంతా తన పిల్లల్లాంటి వారని, వారు ఎప్పుడూ తనకు అవకాశాలు ఇస్తారని కానీ తానే క్యూ లో నిల్చుని సినిమాలు చేయాలని అనుకోవడం లేదని ఎమ్ ఎస్ రాజు అన్నారు. మంచి కథ దొరికితే క్యూ దాటి హీరోల దగ్గరకు వెళ్లే అవకాశం వుంటుందన్నారు.
అయినా పెద్ద సినిమాలు తీసేకన్నా చిన్న మంచి సినిమాలు తీయడానికి ఎక్కువ ఇష్టపడతానని ఆయన అన్నారు. తన ఇన్నింగ్స్ అప్పుడే ముగియలేదని, మరో పది పదిహేనేళ్లు సినిమాలు తీయాలన్నది తన లక్ష్యం అన్నారు.
తన కొడుకు హీరో సుమంత్ అశ్విన్ గురించి ప్రస్తావిస్తూ మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడని, మధ్యలో కొన్ని రాంగ్ స్టెప్ లు పడ్డాయని, ఇప్పుడు మళ్లీ మంచి కథతో సినిమా చేస్తున్నాడని అన్నారు. ఒక్కసారిగా టాప్ హీరో అయిపోవాలని అనుకోవడం లేదని, కష్టపడి ఒక్కో స్టెప్ ఎక్కుతూ వెళ్లాలని అనుకుంటున్నాడని ఆయన వివరించారు.